భారత రాష్ట్ర సమతి కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు లెక్క లేదు. మూటలు ఢిల్లీకి మోస్తారని .. అవినీతికి అంతే లేదని కేటీఆర్, హరీష్ రావు ఆరోపణలు చేయని రోజు లేదు. ఇప్పుడు కోల్ బ్లాక్ .. వెంటనే సోలార్ టెండర్లు.. ఇలా ప్రతి దానికి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ వీటికి కనీస ఆధారాలు అయినా చూపిస్తున్నారా అంటే.. ఏమీ లేదు. మాట్లాడితే సృజన్ రెడ్డి అంటారు. టెండర్లు ఖరారు చేశారంటారు. రద్దు చేశారంటారు. ఇంత కన్నా ఏం సాక్ష్యాలు కావాలంటారు. అందుకే ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ప్రజల్లో పిసరంత కూడా కదలిక ఉండటం లేదు. ఎవరూ నమ్మడం లేదు.
బలమైన ఆధారాలతో చేసే ఒక్క ఆరోపణ చాలు ప్రజల్ని కదిలించడానికి !
తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దూకుడు పెంచాలని చూస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న వరుస ఆరోపణలు ప్రజల్లో ఎలాంటి కదలికను కలిగించకపోగా, అవి కేవలం రాజకీయ బురదజల్లే కార్యక్రమం అనే ముద్ర పడుతోంది. ప్రతి చిన్న అంశాన్ని కుంభకోణంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, చివరకు వాటిని నిరూపించలేకపోవడంతో ఆ పార్టీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా సింగరేణి టెండర్ల విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. సూదిని సృజన్ రెడ్డి అనే వ్యక్తికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య సంబంధాన్ని అంటగట్టే క్రమంలో కేవలం ఇంటి పేరు లాజిక్‌ను తెరపైకి తెస్తున్నారు. వాస్తవానికి సృజన్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి అల్లుడు . గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన లీగల్ నోటీసులు ఇచ్చారు
రోజూ రొటీన్ ప్రక్రియగా ఆరోపణల రాజకీయం
ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక, పిలిచే ప్రతి టెండర్ వెనుక అవినీతి ఉందంటూ బీఆర్ఎస్ చేస్తున్న రచ్చ ఇప్పుడు రొటీన్ గా మారిపోయింది. ఆధారాలు లేని విమర్శలు చేయడం, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా మాట్లాడటం, జనాల్లో చర్చ మొదలవ్వకముందే మరో కొత్త ఆరోపణకు వెళ్లడం చేస్తున్నారు. ఈ ధోరణి వల్ల ప్రజలు వీటిని సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. ఇది నిత్యం జరిగే ఒక పొలిటికల్ రొటీన్ అని సామాన్య ఓటరు ఫిక్స్ అయిపోతున్నారు.
కాంగ్రెస్‌కు ఏమైనా నష్టం చేయగలిగారా?
ఈ తరహా విమర్శల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి జరగాల్సిన డ్యామేజీ కంటే, బీఆర్ఎస్ ఇమేజ్‌కే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఆరోపణల్లో పస లేకపోవడంతో అధికార పార్టీ నేతలు వాటిని సులభంగా తిప్పికొడుతున్నారు. సరైన డాక్యుమెంట్లు, క్షేత్రస్థాయి ఆధారాలు లేకుండా కేవలం మాటలతో దాడి చేయడం వల్ల భవిష్యత్తులో నిజంగా ఏదైనా కుంభకోణం జరిగినా, ప్రజలు నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు. మొత్తానికి, ఈ ఆరోపణల రాజకీయం బీఆర్ఎస్కు మైలేజీని ఇవ్వకపోగా, కేడర్‌లో నైరాశ్యాన్ని నింపుతోంది. సరైన ఆధారాలతో బయట పెట్టే ఒక్క అవినీతి కేసు చాలు.. ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడానికి. కానీ అలాంటిదేమీ చేయలేకపోతున్నారు. తమ కేసుల్లో విచారణలకు .. డైవర్షన్ అని సాకుగా చెప్పుకుంటున్నారు.
