జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కాస్త మోసుకుంటూ వస్తోంది. సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని ..బీజేపీ పూర్తిగా చేతులెత్తేసిందని ఇక కాంగ్రెస్ కన్నా ఓటర్లు తమకే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. కానీ హఠాత్తుగా బండి సంజయ్.. ముస్లిం టోపీలతో మొదలు పెట్టి వరుసగా వివాదాస్పద ప్రకటనలు చేస్తూ.. బీఆర్ఎస్కు ఆశల్ని చిదిమేస్తున్నారు. ఓట్లు పోలరైజ్ అయ్యే ప్రమాదం ఏర్పడుతోందని బీఆర్ఎస్ కంగారు పడుతోంది. బండి సంజయ్ ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదని అనుకుంటోంది.
బీజేపీ రేసులో ఉండి ఉంటే త్రిముఖ పోటీ -కాంగ్రెస్కు తిరుగులేని సమీకరణాలు
జూబ్లిహిల్స్ లో బీజేపీకి మంచి బలం ఉంది. మంచి అభ్యర్థిని ముందుగానే ఖరారు చేసి ఉంటే ఆ పార్టీ ఖచ్చితంగా రేసులో ఉండేదే. కానీ ఉద్దేశపూర్వకంగా వెనుకడుగు వేసినట్లుగా వ్యవహిరంచింది. అయినా పర్వాలేదు.. మొదటగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేసినప్పుడు బండి సంజయ్ లీడ్ తీసుకున్నారు. ఆయన పెద్దమ్మతల్లి గుడికి.. ముస్లింలకు లింక్ పెట్టి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ఆ టెంపో కొనసాగించి ఉంటే..ముస్లింలు ఫలితాన్ని నిర్దేశించే చోట.. రాజకీయం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని మారిపోయి ఉండేది. కానీ ఆయన మధ్యలో కనిపించకుండా పోయారు. మళ్లీ ప్రచారం ముగిసే మూడు రోజుల ముందు వచ్చారు. మళ్లీ ముస్లిం – హిందూ రాజకీయాలు ప్రారంభించారు.
బండి సంజయ్ రాజకీయాలతో ముస్లిం ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశాలు
బండి సంజయ్ ఇంత దూకుడుగా ముస్లింలను టార్గెట్ చేయడం భారత రాష్ట్ర సమితికి సమస్యగా మారింది. రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర పన్ని బండి సంజయ్ ఇలా చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో ముస్లింలు.. బీఆర్ఎస్ కు ఓటు వేయడానికి సంకోచిస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్..బీజేపీ అవగాహనలో ఉన్నాయని ఇప్పటికే లోపాయికారీగా ప్రచారం జరుగుతోంది. ఎవరికైనా బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్న ఆలోచన ఉంటే..కాంగ్రెస్సే మంచిదని అనుకునే అవకాశం ఉంది. ఓట్లు పోలరైజ్ అయితే అది కాంగ్రెస్ వైపే అని అర్థం చేసుకోవచ్చు. అందుకే బీఆర్ఎస్ కు టెన్షన్ ప్రారంభమయింది.
హిందూ ఓట్లు పోలరైజ్ అయినా బీఆర్ఎస్ కు నష్టం
హిందువుల సత్తా చూపిద్దామని బండి సంజయ్. రఘునందన్ రావు వంటి వాళ్లు ఇస్తున్న పిలుపులు కూడా బీఆర్ఎస్ కు సమస్యగా మారాయి. ఎందుకంటే బీజేపీకి ఎన్ని ఎక్కువ ఓట్లు వస్తే బీఆర్ఎస్ కు ఓటమి అంత దగ్గర అవుతుంది. అందుకే దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ రాజకీయంతో బీజేపీకి డిపాజిట్ వస్తే అది బీఆర్ఎస్ ఓటమికి దారి తీస్తుంది. అందుకే బండి సంజయ్ ను కంట్రోల్ చేసుకునే వ్యూహంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఆయన సైలెంట్ కాకపోతే టీఆర్ెస్ ఆశలన్నీ చిదిమేసినట్లే.


