రాజకీయ నేతలు రాజకీయ కుట్రల కోసం హద్దులు దాటిపోతూంటారు. ఇప్పటి వరకూ రాజకీయ నేతలు.. రాజకీయ నేతలపై కుట్రలు చేసుకుంటూ..తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ తెలంగాణలో ఇది మరో స్థాయికి దిగజారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలేయడానికి.. ఓ మంత్రి అంటూ.. మరో ఐఏఎస్ అధికారిణి పేరును లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు ప్రారంభిస్తున్నారు. ఓ ఊరూపేరూ లేని చానల్ లో ఆ కథనాన్ని ప్రసారం చేయిస్తున్నారు. తర్వాత ఆ వీడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియాకు చెందిన వారు పోస్టు చేసి.. ఆ మంత్రి ఎవరు.. ఆ ఐఏఎస్ అధికారి ఎవరూ అంటూ క్విజ్ ప్రోగ్రాం పెట్టి వైరల్ చేస్తున్నారు. రాజకీయ నేతలు తమపై బురద చల్లించుకోవడానికి.. ఎదుటి వారిపై చల్లడానికి రెడీగా ఉంటారు. కానీ ఈ విషయంలోకి మహిళా ఐఏఎస్ అధికారిని తీసుకు రావడమే అత్యంత వివాదాస్పదమైన అంశంగా మారింది.
ఐఏఎస్ అధికారిణీ వ్యక్తిత్వంపై ఘోరమైన రాతలు
గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మహిళా ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సోషల్ మీడియా తప్పుడు ప్రచారం, కొన్ని వార్తా సంస్థల తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక అధికారిణి వ్యక్తిత్వాన్ని హననం చేయడం ఆమె కుటుంబాన్ని ఈ వివాదంలోకి లాగడంపై పౌర సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం ఊహాగానాలతో ఆమె వ్యక్తిగత జీవితంపై అసభ్యకరమైన ఆరోపణలు చేస్తున్నారు. పరోక్షంగా కాకుండా, దాదాపు నేరుగా ఆమెను ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు జర్నలిజం విలువలకే మచ్చ తెచ్చేలా ఈ కథనాలు ఉంటున్నాయి.
సానుభూతి చూపిస్తున్నట్లుగా నటిస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్న బీఆర్ఎస్
ఈ వివాదంలో బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్, ఆ పార్టీ మద్దతుదారులు, సోషల్ మీడియా కార్యకర్తలు సానుభూతి చూపిస్తున్నట్లుగా నటిస్తూ.. ట్వీట్లు చేస్తున్నారు. ఆ వీడియోను కావాలని వైరల్ చేస్తున్నారు. వారి ప్రమేయం ఉండ బట్టే వాటిని ఇలా వైరల్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఒక ఉన్నత స్థాయి అధికారిణి ప్రతిష్టను దెబ్బతీసేలా అసభ్యకరమైన గాసిప్స్‌ను వీరు వ్యాప్తి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పైకి సానుభూతి చూపిస్తున్నట్లు నటిస్తూనే, లోలోపల అసత్య ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే వ్యూహాన్ని వీరు అమలు చేస్తున్నారు.
మహిళా అధికారి క్యారెక్టర్ తో ఆడుకుని పాలకపార్టీపై దాడి చేస్తారా?
రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి అనేక మార్గాలను అన్వేషించవచ్చు, కానీ ఒక మహిళా అధికారిణి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, ఆమె క్యారెక్టర్‌ను తక్కువ చేసి చూపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కేవలం సదరు అధికారిణిని మాత్రమే కాకుండా, ఆమె కుటుంబాన్ని కూడా ఈ వివాదాల్లోకి లాగడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వ్యక్తిగత ప్రతిష్టను మంటగలిపేలా జరుగుతున్న ఈ దాడులు సదరు అధికారిణి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఇది వ్యవస్థకే ప్రమాదకరం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మహిళా అధికారులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపిస్తోంది.
