మిమ్మల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాడు.. మీరు జాగ్రత్తగా ఉండండి అని.. కొడాలి నాని, వంశీలకు తాను చెప్పానని బుచ్చయ్యచౌదరి ప్రెస్మీట్లో చెప్పారు. కానీ వారు వినలేదని ఇప్పుడు అనుభవిస్తున్నారని తేల్చారు. నిజానికి బుచ్చయ్య చౌదరి చెప్పింది ఇద్దరి గురించే కావొచ్చు కానీ..జగన్ ఇలా బూతుల ట్రాప్ లో పడేసి వాడుకున్న నేతలంతా ఇప్పుడు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.
వాళ్లు అలా నోరు పారేసుకోవడానికి కారణం జగనే – అంతకు ముందు బాగానే ఉండేవారుగా!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ హయాంలో ఐదేళ్లుగా సాగిన వ్యక్తిగత దూషణలు, రాజకీయ విమర్శలు ఇప్పుడు ఆయా నేతలకు ముళ్ళ దారిగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి, ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన నేతలు ఇప్పుడు చట్టపరమైన చిక్కులను, రాజకీయ ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు. జగన్ తన రాజకీయ అవసరాల కోసం నోటి దురుసు నేతలుగా మార్చారని, ఇప్పుడు అధికారం పోయాక వారే ఒంటరిగా పోరాడాల్సి వస్తోంది. వీరంతా స్వహాతహా బూతుల నేతల కాదు. కేవలం జగన్ ..తాను మెచ్చాలంటే పదవులు ఉండాలంటే అలా తిట్టాల్సిందేనని నిర్దేశించారు. అలా తయారయ్యారు.
తీవ్ర ఒత్తిడి జీవితం అనుభవిస్తున్న నేతలు
వైసీపీలో నోరు పారేసుకున్న నేతలంతా ఇప్పుడు వరుసగా కేసులను ఎదుర్కొంటున్నారు. కేవలం జగన్ మెప్పు పొందేందుకు లేదా తమ ప్రాధాన్యతను నిలబెట్టుకునేందుకు పరిధి దాటి మాట్లాడిన నేతలు ఇప్పుడు చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. అధికారం ఉన్నప్పుడు పోలీసులు, వ్యవస్థలు అండగా ఉంటాయని భావించిన వారు, ఇప్పుడు ప్రభుత్వ మార్పుతో పాత వీడియోలు, పోస్టుల ఆధారంగా విచారణను ఎదుర్కొంటున్నారు. అధికారం పోతే ఇలాగే ఎదుర్కోవాల్సి వస్తుందని వారికి బాగా తెలుసు. అయినా జగన్ రెడ్డి 30 ఏళ్ల అధికారం గురించి చెప్పడంతో వారంతా గీత దాటిపోయారు.
సొంత నియోజకవర్గాల్లోనూ దక్కని ఆదరణ
తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేసిన నేతలకు ఇప్పుడు సొంత నియోజకవర్గాల్లోనూ ఆదరణ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్లుగా వెలిగిన వారు, ఇప్పుడు పబ్లిక్ లోకి రావడానికి కూడా సంకోచిస్తున్న పరిస్థితి నెలకొంది. పార్టీ అధినేత కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, రేపు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ అండగా నిలుస్తుందా అన్నది సందేహంగా మారింది. చాలా సందర్భాల్లో ఇలాంటి వివాదాస్పద నేతల నుండి పార్టీ దూరం జరుగుతుందని, చివరకు వారు వ్యక్తిగతంగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవాల్సి వస్తుంది. వారి రాజకీయ. జీవితం రిస్క్ లో పడిపోయింది.
