రియల్ ఎస్టేట్ మోసగాళ్ల బారిన పడితే.. మానసిక శాంతి ఉండదు. డబ్బులూ మిగలవు. బాచుపల్లిలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీని నమ్ముకున్న వారి పరిస్థితి ఇప్పుడు ఇదే. బాచుపల్లిలో ఓ నిర్మాణ సంస్థ తొమ్మిదేళ్లు గడిచినా కొనుగోలుదారులకు ఫ్లాట్స్ ను అందజేయకుండా తిరిగి అదనపు సొమ్ము కోసం డిమాండ్ చేస్తున్న పరిస్థితి వెలుగు చూసింది.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన నెబ్యుల పసిఫిక్ రియల్ ఎస్టేట్ కంపెనీ 2016లో హైదరాబాద్ బాచుపల్లి లో రెరా అనుమతితో 2670 ఫ్లాట్స్ తో భారీ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే నాటినుండి కొనుగోలుదారుల దగ్గర నుండి విడతలవారీగా డబ్బులు తీసుకున్న కంపెనీ గడువులోగా వారికి ఇళ్ళు అందజేయడంలో విఫలమైంది. కరోనా పేరుతో కొంతకాలం గడువును పొడిగించగా నిర్మాణంలో ఆలస్యం కారణంగా మరి కొంతకాలం గడిచిపోయింది.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సైతం ఫ్లాట్స్ అందజేయడం లేదు. డబ్బులు చెల్లించిన వారికి కనీసం అగ్రిమెంటు పేపర్స్ కూడా ఇవ్వలేదు. 9 ఏళ్ల అయినా తమకు ఇల్లు ఇవ్వటం లేదని కొనుగోలుదారులు శనివారం నిర్మాణం వద్ద ఆందోళనకు దిగారు ఇంకా 30 శాతం వర్క్ పెండింగ్ ఉందని అసలు ఎప్పటికీ పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు సదరు నిర్మాణ సంస్థ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులు పెరిగిపోయాయని అదనపు సొమ్ము ఇవ్వాలని బిల్డర్లు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు.
రియల్ ఎస్టేట్లో ఇప్పటికీ ప్రారంభ ఆఫర్లు అంటూ కొందరు రెడీ టు ఆక్యుపై ఆఫర్లు అంటూ, మరికొందరు రియల్టర్లు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. నిర్మాణాలు ప్రారంభించి ఏళ్ళు పూళ్ళు గడుస్తున్న కొనుగోలుదారులకు ఫ్లాట్స్ అందజేయకుండా సతాయిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి మోసాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని మోసాలు వెలుగులోకి వచ్చినా… మోసపోయేవారు ఇంకా ఇంకా ఉంటూనే ఉన్నారు.. కఠినమైన చట్టాలు లేకపోవడంతో ఈ బిల్డర్లు ఆటలు సాగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.