హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కరెక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. బడా బడా బిల్డర్లు ఇప్పుడు రేట్లు తగ్గించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. హై రైజ్, లగ్జరీ పేరుతో ఎస్ఎఫ్టీ రేటును పదివేలకు దాటించేందుకు ఉత్సాహపడిన వారు ఇప్పుడు తాము ప్రకటించిన రేటులోనే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసేందుకు ఏ మాత్రం మొహమాటపడటం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కోకాపేట, నియోపోలిస్ లాంటి ఐటీ కారిడార్ చుట్టూ ఉన్న హాట్ ప్రాపర్టీల్లోనే ఈ ట్రెండ్ కనిపిస్తోంది.
కోకాపేట, నియోపోలిస్ తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హౌసింగ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అన్నీ కనీసం 35 అంతస్తుల పైమాటే. వాటిలో పైకి చెప్పే రేటు ఒకటి ఉంటుంది.. కొనేందుకు ఆ సంస్థల ప్రతినిధుల్ని కలిస్తే చెప్పే రేటు మరొకటి ఉంటుంది. ఇప్పటి వరకూ అదని.. ఇదని చెప్పి ఎక్కువగా వసూలు చేసేవారు. ఇప్పుడు వెయ్యి రూపాయల వరకూ ఎస్ఎఫ్టీకి తగ్గిస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. కోటి రూపాయలు దాటిన ఇళ్లలో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. రెండు కోట్ల వరకూ అయ్యే ఇళ్లకు.. ఇప్పుడు కనీసం పాతిక లక్షల రూపాయల వరకూ తగ్గింపు ఇచ్చేలా బేరమాడుకునే పరిస్థితి కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఫ్లోర్ ప్రీమియం పేరుతో అధికంగా చేసే వసూళ్లకు బ్రేక్ పడుతోంది. వాటిని కూడా తగ్గించుకుంటున్నారు. మార్కెట్లో ఇప్పుడు విస్తృతమైన లగ్జరీ ఫ్లాట్లు అందుబాటులో ఉంటున్నాయి. డిమాండ్ కు మించి బిల్డర్లు ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు. దీంతో ఇళ్ల కొనుగోలుదారులకు చాయిస్ పెరిగింది. హై రైజ్ అపార్టుమెంట్ల లైఫ్ స్టయిల్ కోరుకునేవారు.. అలాంటి ఇళ్లు కొనాలనుకునేవారికి.. ఇంత కంటే మంచి సమయం దొరక్కపోవచ్చు. ఓ సారి.. చుట్టేసి వస్తే.. మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది.