హారర్ జోనర్‌కి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. సరిగ్గా భయపెట్టడం వస్తే చాలు. ఇలాంటి జోనర్లకు కాసులు కురుస్తాయి. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈనెల 12న మరో ఆత్మ కథ రెడీ అయ్యింది. అదే.. `ఈషా`.
హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. అఖిల్ రాజ్ కథానాయకుడు. ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమా వెనుక బన్నీవాస్, వంశీ నందిపాటి లాంటి లక్కీ నిర్మాతలు ఉండడం వల్ల బజ్ ఏర్పడింది. ‘ఆత్మలు గీత్మలూ అంతా ట్రాషే’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. అయితే సినిమా అంతా ఆత్మల హంగామానే కనిపించింది. ట్రైలర్ డీసెంట్ గా ఉంది. మామూలుగా చూసే హారర్ సినిమాల్లో ఎలాంటి ఎఫెక్టులు ఉంటాయో ఇందులోనూ అవే కనిపించాయి. కాకపోతే మరింత ఎఫెక్టీవ్ గా. చిన్న పిల్లలే దెయ్యాలుగా మారి భయపెడితే ఎలా ఉంటుందో… ఈ సినిమాలో చూపించబోతున్నారు. ధృవన్ అందించిన ఆర్.ఆర్, కెమెరా వర్క్ మరింత భయాన్ని పెంచుతున్నాయి.
చిన్న సినిమాలకు ఈమధ్య బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లే దక్కుతున్నాయి. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి ఈమధ్య మెరిసిన చిన్న సినిమాలు. ఈ రెండు సినిమాల వెనుక వంశీ నంది పాటి ఉన్నారు. కాబట్టి ఈసారి కూడా ఆ లక్కీ హ్యాండ్ రాణిస్తుందన్నది అందరి ఆశ. 12న బాక్సాఫీసు దగ్గర పోటీ కాస్త గట్టిగానే కనిపించబోతోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.