రివ్యూ: బుట్టబొమ్మ

Butta Bomma Telugu Movie Review

రేటింగ్‌: 2.25/5

రీమేక్ సినిమాలకి ఒక సౌలభ్యం వుంటుంది. ఒక భాషలో విజయవంతమైన చిత్రాలనే రీమేక్ చేయడానికి నిర్మాతలు పూనుకుంటారు కాబట్టి సెట్స్ పైకి వెళ్ళకముందే కథపై బలమైన నమ్మకం వుంటుంది. అయితే ఒక భాషలో ఆదరించిన కథని వేరే భాష ప్రేక్షకులు ఆదరించాలానే రూల్ లేదు. కొన్ని సార్లు మాతృక‌లోని మ్యాజిక్ రీ క్రియేట్ కాకపోవచ్చు. మరికొన్ని సార్లు ఒరిజినల్ కంటే రీమేక్ గొప్పగా ఆడొచ్చు. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి మరో రీమేక్ సినిమాగా ‘బుట్టబొమ్మ’ వచ్చింది. మలయాళంలో విజయం సాధించిన `కప్పేల` దీనికి ఆధారం. మరి తెలుగు ప్రేక్షకులకు ఈ రీమేక్ ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ? అసలు బుట్టబొమ్మ కథేంటి ?

ఆకు పచ్చని అరకులో ఓ ఊరు. సత్య( అనిక సురేంద్రన్‌) దిగువ మధ్యతరగతి అమ్మాయి. సత్య తండ్రి రోజు కూలీ. తల్లి ఇంట్లో మిషన్ కుడుతుంటుంది. అదే ఊరిలో బాగా డబ్బు, ఆస్తి వున్న చిన్ని అనే అబ్బాయి సత్యని ఇష్టపడతాడు. సత్యకు మాత్రం చిన్ని అంటే పెద్ద ఇష్టం వుండదు. అలా అని అయిష్టం కూడా కాదు. సత్యకి పెద్ద కోరికలు ఏమీ లేవు. తన దగ్గర కేవలం ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే వున్న బీసి కాలం నాటి ఫోన్ వుంటుంది. ఎప్పటికైనా ఓ మంచి కెమెరా వున్న ఫోన్ కొనుక్కొని అందులో రీల్స్ చేసి, పాటలు పాడి పేరు తెచ్చుకోవాలని ఆశపడుతుంది సత్య. అరకులో అటో నడుపుకొని జీవిస్తుంటాడు మురళి(సూర్య వశిష్ట) అతనికి మంచి పేరు వుంటుంది. ఎప్పుడూ ఎఫ్ఎం వింటూ ఉంటాడు. అందమైన గొంతు వింటే పులకరించిపోతుంటాడు. ఒకరోజు సత్య పొరపాటున మురళి ఫోన్ కాల్ చేస్తుంది. రాంగ్ నెంబర్ అని వెంటనే కట్ చేస్తుంది. అయితే సత్య వాయిస్ నచ్చి కాల్ బ్యాక్ చేస్తాడు మురళి. మురళి మాట తీరు సత్యకి నచ్చుతుంది. అలా ప‌రిచ‌యం పెరుగుతుంది. ఫోన్ లోనే ప్రేమించుకుంటారు. అయితే మురళి మాత్రం ఎప్పుడూ సత్యని నేరుగా కలవాలని అనుకోడు. సత్యనే మురళి కలవాలని కోరుకుంటుంది. సత్య కోరిక మేరకు వైజాగ్ లో కలుస్తానని చెప్తాడు మురళి. తల్లితండ్రులు ఇంట్లో లేని రోజు చూసి వైజాగ్ వెళ్ళిన సత్యకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? సత్య, మురళిని కలిసిందా ? సత్య-మురళిల ప్రేమ కథలోకి రామకృష్ణ అలియాస్ ఆర్కే (అర్జున్ దాస్ ) ఎలా వచ్చాడు ? అనేది మిగతా కథ.

కేవలం ఫోన్ లో మాట్లాడుకొని, ప్రేమలో పడిపోయి, విచిత్రమైన పరిస్థితులు ఎదురుకున్న ఓ అమ్మాయి కథ ఇది. తెలుగు నేటివిటీ తగ్గట్టు అరకుని ఎంచుకోవడం తప్పితే మలయాళం కప్పేల కు పెద్ద మార్పులు చేయలేదు. సత్య, ఆమె కుటుంబం, అరకు, అక్కడ మనుషులు, చిన్ని.. మురళి.. ఇలా పాత్రలన్నీ సహజంగా పరిచయమౌతాయి. అయితే కథ పరంగా బొట్టబొమ్మ డ్రామా సెకండ్ హాఫ్ లో వుండటం వలన.. తొలి సగం అంతా డ్రాగ్ చేసినట్లు వుంటుంది. చిన్ని, సత్యని ఇష్టపడటం, కానీ చిన్ని తల్లి అది ఇష్టం లేకపోవడం, ఆమె సత్య తండ్రిని పలుమార్లు అవమానించడం.. సీరియల్ డ్రామా అనిపిస్తుంటుంది. ఇక మురళితో ఫోన్ లో మాట్లాడిన సత్య రెండు మూడు కాల్స్ తర్వాత మురళిపై ప్రేమని వ్యక్తం చేసిన విధానం కూడా ‘టీనేజ్ ప్రేమ కదా..ఇలానే వుంటుంది’ఆని సరిపెట్టుకునేలా వుంటుంది త‌ప్ప‌.. అందులో డెప్త్ ఉండ‌దు.

అసలు కథ ఇంటర్వెల్ బాంగ్ లోనే మొదలౌతుంది. మురళి ఫోన్ పోగొట్టుకోవ‌డం, మురళి పేరుతో రామకృష్ణ సత్యకి పరిచయం చేసుకోవడం తర్వాత ఏం జరుగుతుందో అనే ఆసక్తిని పెంచుతుంది. రామకృష్ణ పాత్రని తీర్చిదిద్దిన తీరు బావుంది. రామకృష్ణ పాత్ర బుట్టబొమ్మ కథలో ఉత్కంఠ రేపింది. చాలా చిన్న కథ ఇది. సెకండ్ హాఫ్ లో వచ్చిన రెండు ట్విస్ట్ లు వర్క్ అవుట్ అయ్యాయి. అయితే క‌ప్పేలా ఆల్రెడీ చూసేసిన‌వాళ్ల‌కు ఏం జ‌రుగుతుందో తెలుసు కాబ‌ట్టి.. అప్ప‌టి వ‌ర‌కూ ఆస‌క్తిగా, సీట్ల‌కు అతుక్కొని కూర్చోవ‌డం క‌ష్టం. ఇదొక సందేశాత్మక చిత్రం. చివర్లో వచ్చిన సందేశం అవసరమైనదే. అయితే ఆ సందేశం చెప్పడానికి.. ఎంచుకున్న కథ‌నం, కథని నడిపిన తీరు కాస్త బోరింగానే వుంటుంది. బహుశా మలయాళం మాతృకని యధావిధిగా ఫాలో కావడం వలన వచ్చిన చిక్కిది. మలయాళం సినిమాలు బావుంటాయి. అయితే వాళ్ళ సినిమాల్లో ప్రొసిడింగ్స్ చాలా సాగదీత వుంటాయి. తెలుగులో రీమేక్ చేసినప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు.. కథనాన్ని కాస్త వేగంతో నడపాల్సింది. కానీ అది జరగలేదు.

అనిక సురేంద్రన్‌ అందంగా కనిపించింది. టీనేజ్ అమ్మాయి పాత్రకి సరిగ్గా సరిపోయింది. తన నటన క్యూట్ గా వుంది. మురళిలో కనిపించిన సూర్య వశిష్ట ప్రజన్స్ బావుంది. చాలా సహజంగా చేశాడు.రామకృష్ణ పాత్రకి అర్జున్ దాస్ పర్ఫెక్ట్ ఛాయిస్. తనకి వున్న ఇమేజ్ కారణంగా.. ఈ పాత్ర మరింతగా పండింది. సత్య తల్లితండ్రులగా కనిపించిన నటులు డీసెంట్ గా చేశారు. పుష్ప జగదీశ్ ఇందులో ఓ పాత్ర చేశాడు. అయితే అది అంత ప్రాధాన్యత వున్న పాత్ర కాదు. మిగతా నటీనటులు పరిధి మేర కనిపించారు.

నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. కెమెరాపనితనం బావుంది. నిజంగా మలయాళం సినిమాల రిమేక్ లకు అరకు బెస్ట్ ఛాయిస్. కెమెరా ఎక్కడ పెట్టినా కంటికి ఇంపైన పచ్చదనంతో నిండిపోయింది. పాటలు బావున్నాయి కానీ గుర్తుపెట్టుకునే పాటలైతే కాదు. గణేష్ రావూరి రాసిన కొన్ని మాటలు బావున్నాయి. ‘మేము పేదోల్లం… మనసు పడేది మీరే అయినా.. మాట పడేది మేమే’ మాట చక్కగా కుదిరింది. మలయాళం కప్పేలా ఒక సందేశాత్మక కథ. చివర్లో ఒక మంచి మెసేజ్ వుంటుంది. బహుశా అదే మెసేజ్ ని తెలుగు ప్రేక్షకులకు కూడా ఇవ్వాలని బొట్టబొమ్మ తీశారు. అయితే ఈ మెసేజ్ ని థియేటర్ కి వచ్చి చూడాలంటే కాస్త ఓపిక వుండాలి. సాగదీతని భరించగలగాలి.

ఫినిషింగ్ టచ్: అట్ట‌ బొమ్మ

రేటింగ్‌: 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close