ఈ వేసవిని టాలీవుడ్ సరిగా వాడుకోలేదన్న ఓ అభిప్రాయం సినీ వర్గాల్లో ఉంది. సమ్మర్ లో పెద్ద సినిమాలు వరుస కట్టడం ఓ రివాజు. కానీ ఈ సారి అలా జరగలేదు. టాప్ స్టార్ సినిమాలేవీ బరిలో లేకపోవడంతో ఈ వేసవి మజా తగ్గింది. మార్చి, ఏప్రిల్ డీలాగానే సాగాయి. ఇప్పుడు మే మొదలైంది. మే1న నాని ‘హిట్ 3’తో టాలీవుడ్ ఆకలి కొంత వరకూ తీర్చాడు. సినిమాకు మంచి టాకే వచ్చింది. లాంగ్ వీకెండ్ ఉంది. కాబట్టి.. ఈ వారం ‘హిట్ 3’ హవా నడిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
తదుపరి వారం ‘సింగిల్’ రెడీగా ఉంది. శ్రీవిష్ణు హీరోగా నటించిన సినిమా ఇది. శ్రీవిష్ణు సినిమాలకు యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ‘సామజవరగమన’తో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కలిశారు. `సింగిల్`పై మంచి హైప్ ఉంది. ట్రైలర్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. కాబట్టి ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకోవొచ్చు. ఈనెలాఖరున `కింగ్ డమ్` రిలీజ్ కు రెడీ అయ్యాడు. విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా ఇది. అన్నింటికంటే ముఖ్యంగా సితార ఎంటర్టైన్మెంట్స్ అందిస్తోంది. సితార మంచి ప్లానింగ్‌తో ఉండే సంస్థ. పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో నాగవంశీకి బాగా తెలుసు. ‘కింగ్ డమ్’కు మంచి హైప్ తీసుకొచ్చి, దాన్ని ప్రారంభ వసూళ్లుగా మలచుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ‘హిట్ 3’కి చూస్తున్న బజ్.. ‘కింగ్ డమ్’కు ఆటోమెటిగ్గా వచ్చేస్తుంది. విజయ్ దేవరకొండ కూడా హిట్ కొట్టి చాలా కాలమైంది. తన నుంచి వచ్చిన ‘లైగర్’, `ఫ్యామిలీస్టార్` అభిమానుల్ని నిరాశ పరిచాయి. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందే. ‘కింగ్ డమ్’ గురించి ఇండస్ట్రీ జనాలు బాగా చెప్పుకొంటున్నారు. సినిమా బాగా వచ్చిందని, మినిమం గ్యారెంటీ ప్రాడెక్ట్ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాబట్టి.. ఈనెలాఖరున ‘కింగ్ డమ్’తో మళ్లీ బాక్సాఫీసుకు జోష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో మరో హిట్ ఏదైనా పడితే టాలీవుడ్ కాస్త గాడిలో పడే అవకాశాలు ఉన్నాయి.