కర్ణాటకలో మరోసారి ప్రభుత్వాన్ని తేల్చే ఎన్నికలు..!

కర్ణాటకంలో కొత్త అంకం ప్రారంభమయింది. అనర్హతా వేటు పడిన పదిహేను మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. డిసెంబర్ 5 న పోలింగ్ జరుగుతుంది. తొమ్మిదో తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే ప్రభుత్వం ఉంటుందో..ఊడుతుందో..నిర్దేశిస్తుంది. భారతీయ జనతా పార్టీకి 105 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.  2018లో ఎన్నికలు ముగిసిన తర్వాత అతి పెద్ద పార్టీ పేరుతో  బీజేపీని గవర్నర్ వజూభాయ్ వాలా ఆహ్వానించారు. కానీ మెజార్టీ చూపించుకోలేక యడ్యూరప్ప రాజీనామా చేశారు. అప్పటికి.. ఆ తర్వాత కూడా సాంకేతికకంగా బీజేపీ బలం ఏమీ పెరగలేదు. 105 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.

అయినప్పటికీ.. మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని కర్ణాటకలో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడియూరప్ప సర్కార్ ఇప్పటికీ మైనార్టీలోనే ఉంది.  జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయా పార్టీలను ధిక్కరించేలా చేసి.. ప్రభుత్వాన్ని పడగొట్టారు. వారందరిపై వేటు పడింది.  ఉపఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే… ఏర్పడబోయే ప్రభుత్వం సుస్ధిరత ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తమ సీట్లన్ని నిలబెట్టుకుంటే.. బీజేపీకి భంగపాటు తప్పదు.  కర్ణాటక అసెంబ్లీ సభ్యుల సంఖ్య 224. మొత్తంగా మ్యాజిక్ మార్క్ 113. ఇప్పుడు బీజేపీ బలం 105. వీటిలో… కనీసం.. ఎనిమిది స్థానాలు బీజేపీ గెల్చుకుంటేనే… ప్రభుత్వం నిలబడుతుంది.

కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలిస్తే మళ్లీ అనిశ్చితి ఏర్పడుతుంది. యడ్యూరప్ప మళ్లీ రాజీనామా చేయాల్సి వస్తుంది. ఉపఎన్నికల్లో ప్రజల మద్దతును బీజేపీ పొందితే.. తిరుగు ఉండదు. ఏదైనా ఉపఎన్నికలతోనే… కర్ణాటకలో ఏం జరుగుతుందోనని తేలాల్సి ఉంటుంది. డిసెంబర్ తొమ్మిదో తేదీన.. కర్నాటకానికి క్లైమాక్స్ జరుగుతుంది. అది సుఖాంతం అవుతుందా.. సీక్వెల్‌కు.. దారి తీస్తుందా.. అనేది ఇప్పుడు.. ఆసక్తికరమై అంశం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com