ఏపీ అసెంబ్లీలో కాగ్ ప్రవేశపెట్టిన నివేదిక ఇప్పుడు వైసీపీ నేతలకు మింగలేక కక్కలేక అన్నట్లుగా మారింది. జగన్ హాయంలోని ఆర్థిక అరాచకాలు, బడ్జెట్ వెలుపల చేసిన అప్పులు, లెక్కల్లో చూపని వేల కోట్ల రూపాయల గోల్మాల్ను కాగ్ కళ్లకు కట్టినట్లు చూపించింది. అయితే, తమ హయాంలో జరిగిన ఈ ఘనకార్యాలను చూసి గర్వపడాలో లేక గింజుకోవాలో తెలియక వైసీపీ సోషల్ మీడియా విభాగం ఒక వింత ప్రయోగానికి తెరలేపింది. నివేదికలో ఉన్నది తమ కాలం నాటి లోపాలే అయినా, దానికి పసుపు రంగు పులిమి.. అది ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసిన తప్పేనంటూ ప్రజల మీదకు వదులుతున్నారు. సామాన్యుడికి అర్థం కాని కాగ్ అంకెలను అడ్డం పెట్టుకుని, ఉల్టా పల్టా రాజకీయం చేయడంలో తమకు సాటిలేరని మరోసారి నిరూపించుకుంటున్నారు.
రాష్ట్ర ఖజానాను ఏ విధంగా ఖాళీ చేశారో, నిబంధనలకు విరుద్ధంగా ఎలా నిధులు మళ్లించారో కాగ్ పాయింట్ వారీగా ఎత్తి చూపితే.. వైసీపీ మాజీ మంత్రులు మాత్రం మైకుల ముందుకు వచ్చి చూశారా! చంద్రబాబు హయాంలో ఎంత అన్యాయం జరుగుతుందో అని ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. నివేదికలో ఉన్న తేదీలు, సంవత్సరాలను కన్వీనియంట్‌గా మార్చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించడంలో వారు చూపిస్తున్న క్రియేటివిటీ ని చూసి నెటిజన్లు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు నివేదికలో ఉన్నది ఏంటి? వీరు చెబుతున్నది ఏంటి? అని ఆరా తీసే లోపే వాట్సాప్ యూనివర్సిటీలో వందల పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి.
నిజానికి కాగ్ నివేదిక అనేది ఒక అద్దం లాంటిది. అది ప్రభుత్వం చేసిన ఖర్చులను, అప్పులను నిక్కచ్చిగా చూపిస్తుంది. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం ఆ అద్దానికి తమ సొంత ఫిల్టర్లు తగిలించి రంగులు మారుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాది 357 రోజులు అప్పుల కోసమే గడిపారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా అంచున నిలబెట్టారని కాగ్ మొత్తుకుంటుంటే.. అది ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని ప్రచారం చేయడం చూస్తుంటే వారి నైతికత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. తప్పులు చేయడం ఒక ఎత్తు అయితే, వాటిని కప్పిపుచ్చుకోవడానికి పక్కా ప్లాన్‌తో అబద్ధాలు ప్రచారం చేయడం మరో ఎత్తు.
