“నీవు ఎలాంటి వాడివో నీ మిత్రుల్ని బట్టి అంచనా వేయవచ్చంటారు పెద్దలు..” ఇది మనుషులకే కాదు అన్ని రంగాలకూ వర్తిస్తుంది. ఏపీ ప్రభుత్వం సింగపూర్‌తో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ఆ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అత్యంత విలువైన సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. కానీ ఏపీ ప్రజల దరిద్రం ఏమిటో కానీ వారిపైనే అవినీతి నిందలు వేసే వారు వచ్చారు. అవినీతిని చాలా సీరియస్ గా తీసుకునే దేశాల్లో మొదటి స్థానంలో ఉండే సింగపూర్ పై అవినీతి మరకలు వేస్తే ఎలా సహిస్తారు?. జగన్ చేసిన అలాంటి తప్పుల్ని దిద్దడానికి ప్రయత్నిస్తున్నానని చంద్రబాబు అంటున్నారు.
ఇప్పుడు కూడా అనుచిత వ్యాఖ్యలు
అవినీతి పరులకు.. అందరూ అలా కనిపిస్తారు. తమ లాగే అందరికీ బురద అంటించాలనుకుంటారు. ఇప్పుడు కూడా వారు తగ్గడం లేదు. గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి సింగపూర్ లో డబ్బులు దాచుకోవడానికి చంద్రబాబు వెళ్లారని ఆరోపించారు. పెట్టుబడుల కోసం.. ఆ దేశ సహకారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురుద్దేశపూర్వకమే. ఏపీకి పెట్టుబడులు వస్తే బాగుపడేది చంద్రబాబు కాదు. ఏపీ ప్రజలే. ఆ విషయం జగన్ అండ్ గ్యాంగ్ కు తెలియనిది కాదు. పెట్టుబడులంటే వారి దృక్కోణం వేరు.
జగన్ చేసినవి చాలా కాస్ట్లీ మిస్టేక్స్
అమరావతిలో సింగపూర్ భాగస్వామ్యాన్ని రద్దు చేసినప్పుడు అంతర్జాతీయ వ్యాపార సమాజం అంతా దిగ్భ్రాంతికి గురయింది. ఇలాంటి అవకాశాన్ని వదులుకున్న ఏపీ ప్రభుత్వాన్ని అందరూ వింతగా చూశారు. గొప్ప అవకాశాన్ని కోల్పోయారని అన్నారు. కానీ జగన్ రెడ్డికి కావాల్సింది.. అభివృద్ధి కాదు. వచ్చిన పరిశ్రమల్ని వెళ్లగొట్టిన ఆయన నిర్వాకాన్ని చూసి అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి అలాంటి పరిస్థితి రానివ్వబోమని భరోసా ఇచ్చి మళ్లీ సింగపూర్ సహకారం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ అమరావతి విషయంలో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ఒప్పందాన్ని పునరుద్ధరించుకుంటుందా అంటే.. చెప్పడం కష్టమే.
అమరావతి సహకారం గేమ్ ఛేంజర్
కానీ ఇతర రంగాల్లో అయినా సహకారం కావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అమరావతిలో తమ పాత ఒప్పందాన్ని సింగపూర్ పునరుద్ధరించుకుంటే అద్భుతమే అవుతుంది. అలాంటి విజయం చంద్రబాబు సింగపూర్ లో సాధిస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును దిద్దడంలో విజయం సాధించినట్లవుతుంది. కానీ జగన్ రెడ్డి చేసింది చిన్న చిన్న తప్పులు కాదు.. వాటిని దిద్దడం అంత తేలిక కాదు !