తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలని జనసేన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఇంకా పూర్తిస్థాయిలో లేకపోవడం ,మిత్రపక్షం బీజేపీతో ఉన్న సమీకరణాలతో జనసేన పార్టీ తన ప్రయత్నాల్లో ఎంత సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో బలోపేతం కావాలని జనసేన లక్ష్యం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన, అదే ఊపును తెలంగాణలోనూ ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, ఇక్కడి రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలం ఏపీతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో బలమైన కమిటీలు లేని స్థితిలో మున్సిపల్ ఎన్నికల వంటి పోరు కు సిద్ధమవ్వడం రాజకీయంగా పెద్ద సాహసమే అనుకోవచ్చు.
బీజేపీతో మైత్రి.. అంతర్గత ఒత్తిడి
ప్రస్తుతం జనసేన జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఒంటరి పోరుకు సిద్ధమవ్వడంపై బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకును జనసేన చీల్చితే, అది అంతిమంగా అధికార కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్కు మేలు చేస్తుందనే ఆందోళన కాషాయ దళంలో ఉంది. ఒకవేళ కార్యకర్తలను సమరోత్సాహంతో సిద్ధం చేసిన తర్వాత, చివరి నిమిషంలో బీజేపీ ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గితే.. పార్టీ విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
పార్టీ బలోపేతం కోసం పోటీ చేసే ఆలోచన
మున్సిపల్ ఎన్నికలను కేవలం గెలుపోటముల కోణంలోనే కాకుండా, గ్రామస్థాయి నుండి పార్టీకి ఒక కేడర్‌ను తయారు చేసుకునే వేదికగా జనసేన భావిస్తోంది. పోటీ చేస్తేనే కార్యకర్తలు నిలబడతారు.. గుర్తింపు వస్తుంది అనే ఆలోచనతో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని జనసేన వ్యూహాకర్తలు భావిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి , యువతలో ఉన్న ఆదరణను ఓట్లుగా మలుచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే!
తెలంగాణలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. గ్రేటర్ ఎన్నికల్లో చివరి క్షణంలో బీజేపీ కోసం విరమించుకున్నారు. అప్పట్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచారం వరకు అన్నీ సొంతంగా చూసుకోవడం కత్తిమీద సామే. ముఖ్యంగా ఆర్థిక బలం, అంగబలం ఉన్న ప్రత్యర్థి పార్టీలను పట్టణ ప్రాంతాల్లో ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఏది ఏమైనా, జనసేన ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. ఈ నిర్ణయం పార్టీని బలోపేతం చేస్తుందా లేక అనవసరపు విమర్శలకు తావిస్తుందా అన్నది వేచి చూడాలి.
