తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు పార్టీపై పెంచుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ హైకమాండ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు. పార్టీ, ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలపై ఎప్పటికప్పుడు నియంత్రణలు విధిస్తూ వచ్చింది. ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి తన చుట్టూ హైకమాండ్ కట్టేసిన సంకెళ్లను మెల్లగా వదిలించుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ సంస్కృతిని అర్థం చేసుకుని ఆ పార్టీ హైకమాండ్ కు బహిరంగ విధేయత ప్రకటిస్తూ.. మరో వైపు రాష్ట్రంలో తన గ్రిప్ పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవరిస్తున్నారు. ఇప్పుడు పార్టీపై పట్టు సాధించే మరో అవకాశం రాజగోపాల్ రెడ్డి రూపంలో వచ్చింది.
వ్యతిరేకిస్తే రాజకీయ జీవితం ఉండదని తెలియాలి !
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే రెబల్ ముద్ర వేసి.. బలవంతుడని అనుకుంటారని రాజగోపాల్ రెడ్డి అనుకుంటున్నారు. ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతీ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయనను ఉపేక్షిస్తే.. ఇతరులూ బయలుదేరుతారు. రేవంత్ ను వ్యతిరేకించే వారికి హైకమాండ్ సపోర్టు లభిస్తుందన్న అభిప్రాయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నందుకు రాజకీయ జీవితం ముగిసిపోయే చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇతరులు రెబల్ గా మారాలన్న ఆలోచనకు రారు.
హైకమాండ్ దృష్టికి రాజగోపాల్ వ్యవహారం
హైకమాండ్ దృష్టికి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ద్వారా ఆయన పని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా వ్యవహరించారు, మునుగోడు ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించారు.. ఎన్నికలకు ముందు ఏం చేశారు.. ఎన్నికప్పుడు ఏం చేశారో అన్ని వివరాలతో హైకమాండ్ కు నివేదికలు పంపారని తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ పార్టీ పై కుట్ర చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి లాంటివారిని ఉపేక్షిస్తే.. పార్టీకి పట్టిన చెదలును నిర్లక్ష్యం చేసినట్లేనన్న అభిప్రాయం హైకమాండ్ కు పంపుతున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన డీకే శివకుమార్ ను..రాజగోపాల్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు గట్టి హెచ్చరికలు ఇచ్చారని చెబుతున్నారు.
చర్యలు తీసుకుంటేనే రేవంత్ కు మరింత విధేయత
రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని రాజకీయంగా డీల్ చేయకపోతే చాలా మంది బయటకు వస్తారు. అనిరుధ్ రెడ్డి లాంటి వాళ్లు ఇప్పటికే ఇలాంటి అవకాశాల్ని టెస్టింగ్ చేశారు. పార్టీని, సీఎంను వ్యతిరేకిస్తే పుట్టగతులు ఉండవని.. అనిపించేలా.. చేస్తే వారంతా రేవంత్ దారిలోకి వస్తారు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ పార్టీని రోడ్డు మీదకు లాగకుండా ఉంటారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది రేవంత్ రెడ్డికి ఒకరు చెప్పాల్సిన పని లేదు. కానీ ఏ కారణంతో అయినా చాన్స్ మిస్సయితే .. వైఎస్‌లా పార్టీపై పట్టు సాధించడం కష్టమవుతుంది. వైఎస్ సీఎం పదవి చేపట్టిన మొదట్లోనూ ఇలాగే ఉండేది. కానీ ఆయన తన రాజకీయంతో అందర్నీ చుట్టేశారు.