ఆంధ్రప్రదేశ్లో రహదారులపై ఉన్న అనుమతి లేని విగ్రహాలన్నింటినీ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్ల మధ్యలో విగ్రహాలు పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయి. ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిని తీసేయాలని స్పష్టం చేసింది. ఇలాంటి విగ్రహాలు ఎక్కువగా వైఎస్ఆర్వి ఉంటాయి.. అలాగే ఎన్టీఆర్ తో పాటు ఇతర నేతలవి ఉంటాయి. మరి అన్నీ తీసేయడం సాధ్యమేనా?
డబ్బులిచ్చి ఊరుకో విగ్రహం పెట్టించిన జగన్
వైఎస్ చనిపోయాక.. ఓ భావోద్వేగ నాటకాన్ని జగన్ రెడ్డి రక్తి కట్టించారు. ఎవరు చనిపోయినా వైఎస్ కోసమే చనిపోయారని లెక్కలు రాసుకున్నారు. ఆ పేరుతో ఓదార్పు యాత్ర చేశారు. ఆ యాత్రలో ఏ ఊరుకు వెళ్తే ఆ ఊళ్లో రోడ్డుపై విగ్రహాన్ని పెట్టేసేవారు. దాని కోసం ఓ వ్యవస్థ పని చేసేది. విగ్రహాన్ని సప్లయ్ చేసేవారు.. మొత్తం ఖర్చులు చూసుకునేవారు. ఆయా గ్రామాలు, ఊళ్లలో పార్టీ నేతలకూ కొంత డబ్బు ఇచ్చి .. ఆవిష్కరణ కార్యక్రమం చేయించేవారు. అలా ఆయన పాదయాత్ర చేసిన రోడ్ల మీద విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా శిథిలావస్థకు చేరుకున్నాయి. అన్నీ రోడ్లపైనే పెట్టారు.
చాలా చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు.. ఇతర నేతల విగ్రహాలు
వైఎస్ఆర్ జగన్ పెట్టించినన్ని కాకపోయినా ఎన్టీఆర్ తో పాటు ఇతర నేతల విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. అన్నింటితో పాటు వాటినీ తొలగించాల్సి ఉంది. అయితే ఏపీ రాజకీయాలకు విగ్రహాలకు లింక్ ఉంది. మా నేత విగ్రహాన్ని తొలగిస్తారా అని.. ఆయా విగ్రహాలకు చెందిన పార్టీలు తెరమీదకు వస్తాయి. వాటిని డీల్ చేయడం చిన్న విషయం కాదు. నిజానికి ఈ విగ్రహాలను అప్పుడప్పుడూ ధ్వంసం చేయించి కూడా రాజకీయాలు చేస్తారు. రోడ్లపై విగ్రహాలు పెట్టడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. అందుకే తీసేయాలని నిర్ణయించారు.
ప్రైవేటు స్థలాల్లో పెట్టుకోవచ్చు !
విగ్రహాలు ఎవరైనా ప్రైవేటు స్థలాల్లో పెట్టుకోవచ్చు. ఎవరూ అడగరు. కానీ పబ్లిక్ ప్లేసులు.. ముఖ్యంగా రోడ్లపై పెడితే మాత్రం తీసేయాల్సిందే. ఇది రాజకీయ సమస్య అవుతుంది. ప్రభుత్వం వాళ్ల లీడర్.. వీళ్ల లీడర్ అన్న ఆలోచన పెట్టుకోకుండా అన్నింటినీ తొలగించాలి. తొలగించే ముందు..దానికి తగ్గ పొలిటికల్ గ్రౌండ్ వర్క్ చేస్తే వివాదం లేకుండా పూర్తి చేయవచ్చు. అలా చేయడం ప్రజలకు ఎంతో మేలు చేయడమే.