రాజ‌ధాని మార్చాల‌నుకుంటే టీడీపీ ఆప‌గ‌ల‌దా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిపై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్య‌ల త‌రువాత రేగుతున్న దుమారం తెలిసిందే. రాజ‌ధానిని మ‌రో చోటికి మారుస్తారా అనే చ‌ర్చ తీవ్రంగా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో వైకాపా నేత‌లు దీనిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం మాట ప‌క్క‌న‌బెట్టి, రాజ‌కీయంగా దీన్ని మ‌రింత ర‌చ్చ‌కు చూస్తున్న‌ట్టుగా ఉన్నారు!! అమ‌రావ‌తిపై ప్ర‌తిప‌క్ష టీడీపీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇది తుగ్ల‌క్ నిర్ణ‌యం అవుతుంద‌ని అంటూ కొడాలి నాని సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇక‌, రాజ‌ధాని ప్రాంతంలో రైతులు, భూములు కొన్న‌వారు కూడా ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి కొడాలి నాని కూడా చ‌ర్చ‌ను రాజేసే వ్యాఖ్య‌లే చేశారు.

అమ‌రావ‌తి విష‌య‌మై బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌ల్లో త‌ప్పేముంద‌న్నారు మంత్రి కొడాలి నాని. వైకాపాలో అంత‌ర్గ‌తంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌నే ఆయ‌న బ‌య‌ట‌పెట్టార‌న్నారు! రాజ‌ధాని న‌గ‌రాన్ని అమ‌రావ‌తి నుంచి ఎక్క‌డికైనా మార్చేస్తామ‌ని వైకాపా ప్ర‌భుత్వం ఎక్క‌డైనా చెప్పిందా అని ప్ర‌శ్నించారు? ఒక‌వేళ మార్చాల‌ని తమ ప్ర‌భుత్వం గ‌ట్టిగా నిర్ణ‌యం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ దాన్ని ఆప‌గ‌ల‌దా, వారు చేప‌ట్టే ఉద్య‌మాలు అడ్డుకోగ‌ల‌వా అంటూ స‌వాల్ చేసే విధంగా వ్యాఖ్యానించారు. రాజ‌ధాని పేరుతో గ‌త ప్ర‌భుత్వం తీవ్ర అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌నీ, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుని కోట్ల‌కు కోట్లూ కొంత‌మంది దోచుకున్నార‌నీ, అలాంటివాళ్లే ఇప్పుడు గ‌గ్గోలు పెడుతున్నార‌ని నాని అన్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన అక్ర‌మాల‌పై మంత్రి వ‌ర్గ ఉప సంఘం విచార‌ణ చేస్తోంద‌నీ, త్వ‌ర‌లోనే అన్నీ బ‌య‌ట‌కి వ‌స్తాయ‌నీ, అక్ర‌మార్కులు జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్నారు. పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్ పై హైకోర్టు ఇచ్చిన స్టే తాత్కాలిక‌మేన‌నీ, ఖ‌ర్చు త‌గ్గించ‌డం కోస‌మే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ విధానాన్ని తీసుకొచ్చార‌న్నారు.

రాజ‌ధానిని ఎక్క‌డికీ మార్చేది లేదు, జ‌రుగుతున్న‌దంతా దుష్ప్ర‌చార‌మే, అలాంటి వ్యాఖ్య‌ల్ని న‌మ్మొద్దు అని స్ప‌ష్టంగా చెప్పి ఊర‌కుంటే బాగుండేది! ఒక‌వేళ మార్చాల‌నుకుంటే, దాన్ని టీడీపీ అడ్డుకోగ‌ల‌దా, త‌మ‌ని ఆప‌గ‌ల‌రా అన‌డంలోనే రాజకీయ ర‌చ్చ‌ ఉద్దేశ‌మే క‌నిపిస్తోంది. ఈ సంద‌ర్భంలో ప్ర‌తిప‌క్షానికి స‌వాల్ చేయాల్సిన అవ‌స‌రం ఏముంది..? ప్ర‌జ‌ల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించింది అధికార పార్టీవారే. దానికి ఎక్క‌డో చోట ఫుల్ స్టాప్ పెట్ట‌కుండా, ప్ర‌తిప‌క్షాన్ని కూడా రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతున్న‌దీ వారే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com