జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయం పక్కన పెడితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఆన్ లైన్,ఆఫ్ లైన్ ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు చూపించింది. పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లలో డిపాజిట్ కోల్పోయిన ఆ పార్టీ తాము రేసులోనే ఉన్నామని నిరూపించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. గెలుపోటములతో సంబంధం లేకుండా.. బలమైన పార్టీగా ఉన్నామన్న సంకేతాలు పంపారు. అసలు ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందన్న సమయంలో అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నిక ఆ పార్టీకి ఊపిరి పోసింది. ఇప్పుడు అలాంటి ఊపిరి వైసీపీకి కూడా అవసరం. అందుకే ఓ ఉపఎన్నిక వస్తే బాగుండని వైసీపీ క్యాడర్ కోరుకుంటున్నారు.
ఉపఎన్నిక వస్తే ప్రభుత్వ వ్యతిరేకత పై ప్రచారం చేయవచ్చు !
ఉపఎన్నిక వస్తే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయిందని ప్రచారం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అదే అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకుంది. నిజానికి ఉపఎన్నికల పవర్ ఏంటో వైసీపీకి తెలియనిది కాదు. ఉపఎన్నికలతోనే ఆ పార్టీ ఒకప్పుడు బలపడింది. ఇప్పుడు కూడా క్లిష్ట పరిస్థితుల్లో అలాంటి ఉప ఎన్నికలతోనే బలపడితే.. మళ్లీ రేసులోకి రావొచ్చని కొంత మంది సలహాలిస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అది రాజకీయంగా కాదని.. నిజంగానే ఎక్కువగా వ్యతిరేకత ఉందని వైసీపీలో కొంత మంది గట్టిగా నమ్ముతున్నారు. అదే నిజం అయితే ఉపఎన్నిక వారి పార్టీకి బూస్ట్ తెచ్చి ఇస్తుంది.
అత్యంత బలమైన సీటులో ఉపఎన్నిక తెచ్చుకుంటే సేఫ్!
బీఆర్ఎస్ పార్టీకి ఉపఎన్నిక బూస్ట్ ఇచ్చిన వైనం చూసిన తర్వాత వైసీపీ కూడా ఉపఎన్నిక వల్ల ప్రయోజనాలు పొందాలని అనుకోవడంలో తప్పు లేదు. అయితే వైసీపీ ఆషామాషీగా ఉపఎన్నికలకు వెళ్లకూడదు. తమ పదకొండు మందిలో ఎవరో ఒకరితో రాజీమానా చేయించి ఉపఎన్నిక తీసుకు వస్తే ఆ సీటు నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. అత్యంత బలంగా ఉన్న.. తిరుగులేని విజయం సాధించే అవకాశం ఉన్నసీటును ఎంచుకోవాలి. ఆ సీటు పులివెందుల లేదా.. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు అవ్వొచ్చు. కానీ రాజకీయంగా మరింత ఇంపాక్ట్ చూపించాలంటే ఖచ్చితంగా పులివెందులకు ఉపఎన్నిక వచ్చేలా చూస్తే బెటరని అనుకుంటున్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వలేదని జగన్ రాజీనామా చేస్తే రిఫరెండం !
జగన్ రెడ్డి అసెంబ్లీకి పోవడం లేదు. పోవాలని కూడా అనుకోవడం లేదు. కోర్టులో పిటిషన్లు వేస్తే ముందుకు సాగడం లేదు. అందుకే ఇప్పుడు పులివెందుల ప్రజల వద్దకే తీర్పునకు వెళ్లి..తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే వాయిస్ ను తిరుగులేని మెజార్టీ ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి చూపించాలని ఆయన రాజీనామా చేస్తే రాజకీయం ఎఫెక్టివ్ గా మారుతుంది. ఏం చేసినా టీడీపీ అక్కడ గెలవదని.. వైసీపీ నేతల నమ్మకం. అందుకే ఈ సీటు ద్వారా ఉపఎన్నిక తెచ్చుకుని…తిరుగులేని మెజారిటీ తెచ్చుకుని.. ఏపీలో కూటమి ప్రభుత్వం పని అయిపోయిందని.. ప్రజాభిప్రాయం మారిపోయిందని నిరూపిస్తే.. ఇక జగన్ కు , వైసీపీకి వచ్చే ఎన్నికల వరకూ చింత లేనట్లుగానే ఉంటుంది.


