వైసీపీ నుండి సస్పెండ్ చేయడంతో.. ఉల్లాసంగా, ఉత్సాహంగా దివ్వెల మాధురీతో కలిసి టూర్లు , రీల్స్ తో సరదాగా గడిపేస్తున్న దువ్వాడ శ్రీనును పాత రాజకీయాలు వదిలి పెట్టడం లేదు. వైసీపీలో చురుకుగా ఉన్నప్పుడు.. ఆయన పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మామూలుగా విమర్శలు చేసి ఉంటే ఎవరూ పట్టించుకోరు కానీ.. నెలకు రూ. యాభై కోట్లు చంద్రబాబు నుంచి తీసుకుంటున్నారని..దానికి తన వద్ద సాక్ష్యాలున్నాయని ప్రకటించారు. ఇది జరిగింది ఫిబ్రవరిలో. అప్పట్లోనే జనసేన శ్రేణులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అది కేసు అయింది.
దువ్వాడను ఏ కారణంతో పార్టీ నుంచి తప్పించారో కానీ.. ఆయన ఫ్రీ అయ్యారు. రాజకీయాలు మాట్లాడటం తగ్గించారు. మీడియా ఇంటర్యూల్లో ఎప్పుడైనా రాజకీయాల ప్రస్తావన వస్తే.. అది కూడా వైసీపీ ప్రస్తావన వస్తే వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. జగన్ గురించి కాస్త పద్దతిగానే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ వైసీపీలో ఉన్నప్పుడు మాత్రం ఆయన ప్రత్యర్థుల గురించి విపరీతంగా నోరు పారేసుకునేవారు. అచ్చెన్నాయుడుని ఎలా తిట్టేవారో చెప్పాల్సిన పని లేదు. అలాగే పవన్ కల్యాణ్ పైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు.
ఆయన రాజకీయాల్లో చేసిన ఘోరాలపై కేసులు నమోదయ్యాయనుకున్న సమయంలో ఫ్యామిలీ డ్రామా బయటకు వచ్చింది. అప్పట్నుంచి ఆయనపై ప్రత్యేకంగా కేసుసు పెట్టి అరెస్టు చేయాల్సిన పనిలేదు.. ఆయనే కావాల్సినంత వినోదం పంచుతారని సైలెంటుగా ఉన్నారు. అదే జరిగింది. ఇప్పటికే ఆయన జీవితం నవ్వుల పాలయింది. అయితే పాత కేసులు మళ్లీ బయటకు వస్తున్నాయి. వైసీపీలో ఉన్నప్పుడు జగన్ ను ఆనందింపచేయడానికి.. పదవులు పొందడానికి చేసిన తప్పిదాలకు ఇప్పుడు శిక్షలు అనుభవించాల్సిన సమయం దగ్గర పడేలా ఉంది.