టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఏఐ సాంకేతికతతో సృష్టించిన ఫేక్ వీడియోలని తేలింది. ఈ దుష్ప్రచారంపై మదనపల్లెకు చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ వీడియోల ద్వారా బీఆర్ నాయుడు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అత్యాధునిక ఏఐ సాంకేతికతను వాడుకుని ప్రముఖులపై తప్పుడు వీడియోలు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించే ముఠాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదైందని, సోషల్ మీడియాను విషపూరితం చేస్తున్న ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి ఫేక్ వీడియోలను షేర్ చేయడం కూడా నేరమేనని వారు స్పష్టం చేశారు.
నిందితులకు కఠిన శిక్ష పడాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సాంకేతికతను మంచి పనులకు కాకుండా, వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి వాడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు, ఈ వీడియోల మూలాలను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సాయం తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈ వీడియో వైసీపీ సోషల్ మీడియా టీం క్రియేట్ చేసిందన్న అనుమానం ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు జరిగే అవకాశాలు ఉన్నాయి.


