అధికారంలో ఉన్నాం కాబట్టి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టాలని ఇష్టం వచ్చినట్లుగా పెట్టారు. ఒక్క దానికీ ఆధారాల్లేవు. రోజువారీగా జరిగే పనులను చూపించి అది కూడా తప్పేనని కేసులు పెట్టారు. ఒక్క రూపాయి మనీ ట్రయల్ చూపించలేకపోయారు. చివరికి ఇప్పుడా కేసులన్నీ తప్పని తేలుతున్నాయి. ఫిర్యాదులు చేసిన వాళ్లు కూడా ఆధారాలు చూపించలేక.. గతంలో తాము ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందో చెప్పలేక.. తమకేం తెలియదని చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి సమయంలో కోర్టుల్లో కేసులు నిలబడటం లేదు. ఇలా నిలబడకపోవడంతో వైసీపీ గగ్గోలు పెడుతోంది. తమ పార్టీకి చెందిన అత్యున్నత రాజ్యాంగ , న్యాయనిపుణుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో గగ్గోలు పెట్టిస్తోంది.
తప్పుడు ప్రచారంతో వ్యవస్థలపై ఒత్తిడికి ప్రయత్నం
వైసీపీ , వైసీపీ అధినేత స్ట్రాటజీ మొదటి నుంచి ఒక్కటే. తమ వద్ద ఉన్న మీడియా, సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేసి వ్యవస్థలపై ఒత్తిడి తీసుకురావడం. న్యాయాన్ని అందించకుండా ఆలస్యం చేయడం. ఈ లోపు తాము అనుకున్న వారిని రాచిరంపాన పెట్టడం. ప్రజల్లో వారి పరువు తీయడం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కేసులు తేలిపోతూంటే ఆధారాలు చూపించలేకపోయిన వారిది తప్పు అని చెప్పకుండా.. అడ్డగోలు ప్రచారం చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల మీద నిందలేస్తున్నారు. వ్యవస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
తీర్పులు నచ్చకపోతే పైకోర్టుకు వెళ్లాలి.. కానీ తప్పుడు ప్రకటనలు ఎందుకు?
చంద్రబాబుపై కేసులు నిలబడకపోతే.. ఆ కేసుల్లో ఆధారాలు ఉంటే.. హైకోర్టుకు వెళ్లాలి. చేయాల్సిన ప్రక్రియ అది. హైకోర్టులో పిటిషన్లు వేసి ది గ్రేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో వాదనలు వినిపించి.. కేసును రీ ఓపెన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈ సుధాకర్ రెడ్డి కోర్టులో వాదించకుండా ప్రెస్క్లబ్బుల్లో వాదిస్తున్నారు. అంటే వారికి కావాల్సింది కోర్టుల్లో జరిగే ప్రక్రియ కాదు. కేవలం మీడియాతో తప్పుడు ప్రచారాలు చేసి కొంత మందిని అయినా నమ్మించడం అని అర్థం అవుతుంది. ఇలా చేయడానికి వ్యవస్థల్ని నిందించడానికి వెనుకాడటంలేదు.
తప్పుడు కేసులు పెట్టిన, పెట్టించినవారిపై చర్యలుండాలి!
టీడీపీ నేతలను వేధించడానికి జగన్ సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలో రోజువారీ సమావేశాలు జరిగేవని.. అందరికీ తెలుసు. ఎప్పుడేం చేయాలో అక్కడే డిసైడ్ చేసేవారు. కనీస ఆధారాలు లేకపోయినా సగం సమాచారం దాచి.. దాంతోనే కేసులు పెట్టమని అతి తెలివి చూపించేవారు. ఈ కుట్రల్లో పాలు పంచుకున్నవారికిసరైన ట్రీట్ మెంట్ ఇస్తే.. అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. కానీ ప్రభుత్వం అక్కడి వరకూ వెళ్లడంలేదు. న్యాయపరమైన ప్రక్రియకే ప్రాధాన్యం ఇస్తోంది. అలా కాకుండా తప్పుడు కేసులు పెట్టిన కుట్రదారుల్ని కూడా టార్గెట్ చేస్తే.. వ్యవస్థలపై నిందలేయడం ఆగిపోతుంది.
