ప్రశాంత్ కిషోర్ వల్ల ఆంధ్ర లో కులాల కుంపట్లు పెరిగాయన్న ఏబిఎన్ ఆర్కె, నిజమేనా?

ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ సంపాదకీయాల పై కొంతమంది పాఠకులు ఆసక్తి గా ఉంటారు. ఆయన ఒక పార్టీకి అనుకూలంగానే వ్యాఖ్యలు చేస్తాడన్న అభిప్రాయం ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఆయన రాసిన దాంట్లో ఎంతో కొంత వాస్తవం, కొత్త విషయం ఉంటుందన్న అభిప్రాయం వల్ల ఇతర పార్టీల అభిమానులు కూడా ఆయన సంపాదకీయాలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఆయన తాజా సంపాదకీయంలో ప్రశాంత్ కిషోర్ వల్లే ఆంధ్రప్రదేశ్ లో కులాల కుంపట్లు పెరిగాయి అని రాసిన వ్యాఖ్యలపై మాత్రం విమర్శలు వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రశాంత్ కిషోర్ వల్ల ఆంధ్రలో కుల వైషమ్యాలు అన్న ఆర్ కె:

తాజా రాజకీయాలపై ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ విశ్లేషణ చేస్తూ, స్థానిక పరిస్థితులను బట్టి కులం, మతం వంటి కార్డులను ప్రశాంత్ కిషోర్ ఉపయోగిస్తూ ఉంటాడని, వాటిని తన అస్త్రాలుగా మార్చి తన క్లయింట్ల కోసం పని చేస్తాడని, తాను చేసే వ్యూహాల వల్ల రాజకీయాలు భ్రష్టు పట్టి పోయాయి అని , ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దీనికి నిదర్శనం అని, కులాల కుంపట్లు కొంతవరకు అప్పటికే ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల లోకి, వారి మెదళ్ళలో కి విషం ఎక్కించి విద్వేషాలు వ్యాపించేలా ప్రశాంత్ కిషోర్ చేశాడని, ఒక కులానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రశాంత్ కిషోర్ సమీకరించాడని, రాధాకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఏపీలో కుల రాజకీయాలు ప్రశాంత్ కిషోర్ కంటే ముందే ఉన్నాయి:

అయితే తాజా గా ఏబీఎన్ రాధాకృష్ణ రాసిన వ్యాసంలో వాస్తవాల కంటే ప్రశాంత్ కిషోర్ పై రాధాకృష్ణ కు ఉన్న అక్కసే ఎక్కువగా కనిపిస్తోంది అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీలో కుల రాజకీయాలు ఈ రోజు కొత్తగా మొదలైనవి కావు. గట్టిగా మాట్లాడుతుంటే స్వాతంత్రానికి పూర్వం కూడా ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు నడిచాయి. ఇక స్వాతంత్రానంతరం దశాబ్దాలపాటు రెడ్డి సామాజిక వర్గం పాలకుల చేతిలో ఆంధ్ర ప్రదేశ్ ఉండింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అది మరొక సామాజిక వర్గానికి చెందిన పాలకుల చేతిలోకి వచ్చింది. అయితే రెడ్డి సామాజిక వర్గం అయినా కమ్మ సామాజిక వర్గం అయినా అన్ని కులాల వారు ఓట్లు వేస్తేనే అధికారం సంపాదించుకోగలరు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రం లో ఆధిపత్యపోరు రెండు సామాజిక వర్గాల మధ్య కేంద్రీకృతం అయింది అన్న విషయం ప్రజలకు చాలా సంవత్సరాల కిందటే అవగాహన అయింది. దీంతో ఇతర వర్గాలు కూడా ఆధిపత్య రేసులోకి ప్రవేశించాలని ప్రయత్నించినా బలమైన ఈ రెండు వర్గాలను ఢీకొనడం వారి వల్ల కావడం లేదు.

ఆత్మవిమర్శ మానేసి ప్రశాంత్ కిషోర్ పై నెపం వేసే ప్రయత్నం:

మన సమాజం పోకడ ఇలా ఉంటే, ఎక్కడి నుండో వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ ప్రజల లో కొత్తగా కులాల కుంపట్లు తెచ్చాడని రాధాకృష్ణ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒక కులానికి వ్యతిరేకం గా ప్రశాంత్ కిషోర్ సమీకరించాడని వ్యాఖ్యానించడం కూడా సరైన వ్యాఖ్యలా కనిపించడం లేదు. వ్యూహకర్తలు ఎన్ని నినాదాలు తీసుకున్నా అందులో ఎంతో కొంత వాస్తవం లేకపోతే ప్రజలు వాటిని నమ్మరు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిజంగానే అభివృద్ధి జరిగినప్పటికీ, అనేక విషయాల్లో రాష్ట్రం పురోగతి సాధించినప్పటికీ, ఆయన సామాజిక వర్గం మాత్రమే బాగుపడుతోంది అన్న అభిప్రాయం ప్రజలలో ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టక ముందే ఏర్పడింది. దీనికి తోడు చంద్రబాబు హయాంలో జరిగిన అనేక అంశాలు, ఉదాహరణకు- ఆ మధ్య జరిగిన నంది అవార్డుల లో ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే అవార్డులు ఎక్కువ వచ్చాయన్న రచ్చ జరగడం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వంటివారు ఇతర పార్టీల నేతలను ఉద్దేశించి అలగా జనం, సంకరజాతి వంటి పదాలను ఉపయోగించడం, 2014లో పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకున్న టిడిపి పార్టీకి చెందిన నేతలైన చింతమనేని ప్రభాకర్ వంటి వారు గెలిచిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ వల్ల మాకు ఒరిగిందేమీ లేదు అన్న వ్యాఖ్యలు చేయడం, నందమూరి బాలకృష్ణ వంటి వారు అసలు పవన్ కళ్యాణ్ ఎవరో కూడా తనకు తెలియదు అని వ్యాఖ్యానించడం, ముద్రగడ విషయంలో చంద్రబాబు సున్నితం గా హ్యాండిల్ చేయలేకపోవడం – ఇటువంటి అనేక అంశాలు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వర్గాన్ని పార్టీ నుంచి దూరం చేశాయి.

అయితే ఈ విషయాలన్నీ మరుగున పరచి కేవలం ప్రశాంత్ కిషోర్ వల్ల మిగతా సామాజిక వర్గాలకు చంద్రబాబు సామాజిక వర్గానికి మధ్య గ్యాప్ పెరిగిందని రాధాకృష్ణ భావించడం, రాయడం హాస్యాస్పదమే కాకుండా, ఆత్మవంచన కూడా అవుతుంది. జరిగిన పొరపాట్లను విశ్లేషించుకుని ఆ పొరపాట్లను సరిదిద్దుకుని దూరమైపోయిన సామాజిక వర్గాలను మళ్లీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేయకుండా ప్రశాంత్ కిషోర్ మీద నెపం వేసి చేతులు దులుపుకోవడం తెలుగుదేశం పార్టీ కి భవిష్యత్తులో చేటు చేస్తుంది తప్పించి ఏ రకమైన మేలు చేయదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close