సంక్రాంతి ప్రత్యేకం : ఇది “చితికిపోని” రైతు కుటుంబం!

ఆవులు,దూడలు లాంటి పశుసంపదని కుటుంబసభ్యులుగా భావించి ఎంతో అనుబంధంగా ఉండే రైతు కుటుంబాల్లో ఆ పాత రోజుల్లో  పరిస్థితి ఎలా ఉండేదో నవీన్ పెద్ధాడ గారి అద్భుత వర్ణన:

తడికతోసుకుని లోపలికి వస్తూనే వసారాలో వెన్న చిలుకుతున్న పెళ్ళాంతో “ఎర్రపడ్డ లేచిందా” అని అడిగాడు…అలాగే వుంది అంటూ అరుకు సీసా, పశువు నోట్లో మందు పోసే వెదురు గొట్టాం అందుకుంది. ఇద్దరూ కొట్టాం వైపు  అడుగులు వేశారు. కామందునీ, యజమానురాలినీ గమనించిన పశువులు సందడి చేశాయి. ఆవులు అరిచాయి. కర్రిగిత్త కట్డ కొయ్య దగ్గర ముంగాలి గిట్టతో నేల గీరుతూ వేసిన రంకె ఖణేలు మంది. పండుకున్న ఆరు కారుల ఎద్దు లేచి నిలబడి పొలం వైపు చూసింది. విప్పని పచ్చి మోపు వైపు కోడెదూడ మూతి సాచి చెమ్మ ఆరుతున్న గడ్డి వాసన చూసి ఓ గెంతు గెంతింది.

యజమానురాలు ఇచ్చిన వెదురుగొట్టంలో అరుకు పోసి, నలతగా వున్న పడ్డ పక్కన యజమాని కూర్చున్నాడు. మెడ నిమిరే కొద్దీ ఇంకా ఇంకా అన్నట్టు మోరసాచింది. ఒడుపుగా దానినోరు పెకలించి గొట్టం నోట్లో దూర్చి మెడ పైకెత్తేశాడు. ఇదంతా 20 నుంచి 25 సెకెన్లలో జరిగిపోయింది. మందు మింగడంలో ఉక్కిరి బిక్కిరైన సాక్ష్యంగా ”ఎర్రపడ్డ”కళ్ళలో నీళ్ళ పొర మొలిచింది. చాలాసేపు దాన్ని నిమురుతూ అది కుదుటపడ్డాక నిలబడ్డాడు.

లేగదూడ కాళ్ళకి అడ్డం పడి పంచెలాగుతూంది. ఓసి దుంపతెగ మీ అయ్య ఇంకా బువ్వతినలేదు వదిలి పెట్టవే అన్నది యజమానురాలు. ఉండు ఉండు కడగొట్టుది కదా గారాం చెయ్యమంటూంది అని యజమాని నవ్వేశాడు. నీ బిడ్డల్నైనా ఇంత గారాం చేశావా అని ఆమె నిష్టూరమాడింది. ఇది బిడ్డ కాదా? పైగా నోరు లేంది కదే! సమర్ధించుకున్నాడు యజమాని.

రైతుకీ, పశువుకీ మధ్య అనుబంధం ఇంత గాఢంగా వుండేది. సంపన్న రైతులైతే టౌను నుంచి ఫోటోగ్రాఫర్లను పొలం లోకి పిలిపించుకుని పశువులను పక్కన వుంచుకుని ఫొటోలు తీయించుకునే వారు. ఎండుగడ్డి తో పురికట్టిన ధాన్యం రాశులు, ఇంటి పెద్దాయన, ఆయన కొడుకులు, వారిపక్కనే ఎడ్లు, గిత్తలు, ఆవులు, యజమానికీ పాలేరుకీ తేడా తెలియడానికి నిక్కరుతోనో, చేతుల బనీనుతోనో పాలేర్లు వుండేలా ఫోటోగ్రాఫర్లు సూచనలు ఇచ్చేవారు.

ఒడిదుడుకులు వున్నప్పటికీ గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ వేర్వేరు వృత్తుల/కులాల వారి పరస్పర పోషకత్వంతో వికసించేది. ఈ పిరమిడ్ లో శిఖరాగ్రస్ధానం రైతుదే..ఆయనకు అండా దండా, మందీ మార్బలమూ, హంగూ ఆర్భాటమూ పశుగణాలే! 1965 వరకూ ఈ పరిస్ధితి వుండేది…గ్రామాల్లో పాడిపంటలూ, సిరిసంపదలనూ వెల్లువెత్తించడంలో పశుసంపదదే ప్రధాన పాత్రగా వుండేది. ఈ సంరంభాలు అంతటికీ అతి పెద్ద ఐకాన్ సంక్రాంతి సంబరాలే!

వ్యవసాయంలో యాంత్రీకరణ వల్లా, అదేసమయంలో పిల్లల చదువులకు రైతులు పట్టణాలకు వలసలు పోయిన పట్టణీకరణ వల్లా పల్లె వెలుగు మసకబారడం మొదలైంది. ప్రస్తుత గ్లోబలైజేషన్ దశలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ శర వేగంగా అంతరించిపోతోంది.

ఇప్పుడు కూడా పశువులు యజమానుల ఫొటోలు రంగురంగుల్లో గనబడుతాయి. అయితే ఏదో రకమైన వాణిజ్య ప్రయోజనాలు లేదా ప్రదర్శించుకునే ఎగ్జిబిషనిజాలే ఆ సన్నివేశాల్లో కనబడుతాయి…కానీ పశువులు కూడా కుటుంబ సభ్యులేనన్న ప్రేమాస్పదమైన అనుబంధాన్ని మాత్రమే చూపించే ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఇకపై కనబడే అవకాశంలేదు.

అయితే, తాతలు గతించాకా వారి రూపుల్లో వారసుల్లో వున్నట్టే, తరాలూ వేషభాషలు మారినా ఒక జాతి సంస్కృతీ సంప్రదాయాలు రూపం మార్చుకుని కూడా సజీవంగా కొనసాగుతూనే వుంటాయి….అదే సంక్రాంతి

(ఫొటో కర్టిసీ : ఈ ఫొటో వాట్సప్ లో సర్కులేట్ అవుతోంది. ఒక ఫ్రెండ్ నాకు పంపించారు. ఫోటోని షేర్ చేసిన అజ్ఞాత వ్యక్తికి కృతజ్ఞతలు. ఫొటో చూశాక నా బాల్యం జ్ఞాపకాలను, పెద్దయ్యాక నేను చదివిన వ్యాసాలు, కథలను సమన్వయం చేసుకుని అప్పటి వాతావరణాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలనుకున్న ప్రయత్నమే ఈ చిన్న వ్యాసం – పెద్దాడ నవీన్)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com