వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అన్నదానిపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీబీఐ తరపు లాయర్లు అదనపు సమయం కోరారు. దాంతో ఈ అంశంపై తదుపరి విచారణ పదహారో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. గత విచారణలో ఎంత బెయిల్స్ రద్దు చేయాలి.. తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అన్నది చెప్పాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేకపోయింది.
సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని వారి బెయిల్స్ రద్దు చేయాలని వైఎస్ సునీతతో పాటు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగుతోంది. వివేకా కేసుకు సంబంధించి ఇతర పిటిషన్లన్నింటినీ కలిపి విచారిస్తున్నారు. గత విచారణలో సీబీఐ అధికారి రాంసింగ్తో పాటు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై పెట్టిన కేసులను క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు అధికార దుర్వినియోగం చేసేందుకే ఈ కేసులు పెట్టినట్లుగా అర్థమవుతోందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ కేసులో నిందితులకు ఉరి శిక్ష కూడా వేసే అవకాశం ఉందని సీబీఐ తరపు లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో నిందితులు ఒకటి, రెండేళ్లు జైల్లో ఉండటం అన్నది పెద్ద విషయం కాదన్నారు. సాక్ష్యాలను తుడిచి పెట్టే ప్రయత్నం చేయడం, సాక్షులను బెదిరించడంపై పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. అవన్నీ నిరూపితమయ్యాయని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. తదుపరి దర్యాప్తు అవసరమా, నిందితుల కస్టోడియల్ విచారణ అవసరమా, ఎంత మంది నిందితుల బెయిల్ రద్దు చేయాలన్నది తదుపరి విచారణ నాటికి చెప్పాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అయితే సీబీఐ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో పదహారో తేదీకి వాయిదా పడింది. ఆ రోజు సీబీఐ అఫిడవిట్ దాఖలు చేస్తే.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి.