మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుమారు రెండేళ్ల విరామం తర్వాత సీబీఐ అధికారులు మళ్లీ క్షేత్రస్థాయి విచారణను ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును మళ్లీ ప్రారంభించిన సీబీఐ అధికారులు శుక్రవారం కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో పలువురు అనుమానితులను విచారించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న భరత్ యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్, అలాగే నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్‌లను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. కేసు దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల గడువును కూడా సవరించడంతో సీబీఐ ఈసారి మరింత పకడ్బందీగా అడుగులు వేస్తోంది.
ముఖ్యంగా హత్య జరిగిన రోజు అర్ధరాత్రి జరిగిన ఫోన్ సంభాషణలపై సీబీఐ దృష్టి సారించింది. వివేకా హత్య విషయం బయట ప్రపంచానికి తెలియకముందే, అంటే మార్చి 15, 2019 తెల్లవారుజామున 1:40 గంటల ప్రాంతంలో కిరణ్ యాదవ్ తన వాట్సాప్ నుంచి అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి కాల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది? హత్య గురించి ముందే సమాచారం ఉందా? అనే కోణంలో సీబీఐ అధికారి రోహిత్ యాదవ్ ఆరా తీశారు. ఇప్పటికే ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లో అర్జున్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు, ఇప్పుడు పులివెందులలో మిగిలిన వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు.
వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అభ్యర్థన మేరకు ఈ తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో గతంలో వదిలేసిన కొన్ని కీలక లింకులను, ముఖ్యంగా కాల్ డేటా రికార్డుల ఆధారంగా తెర వెనుక ఉన్న పెద్దల పాత్రను బయటపెట్టడమే లక్ష్యంగా సీబీఐ పని చేస్తోంది. విచారణకు హాజరైన వారు తామంతా బంధువులమని, సాధారణంగానే మాట్లాడుకున్నామని చెబుతున్నప్పటికీ, సీబీఐ మాత్రం ఆ అర్ధరాత్రి సంభాషణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానంతో ఉంది. శనివారం కూడా మరికొంత మందిని విచారించే అవకాశం ఉండటంతో, ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
