కల్తీ నెయ్యి కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సీబీఐ సిట్ ప్రశ్నించింది. విజయవాడ జైల్లో ఉన్న ఆయనను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు ప్రత్యేకమైన అనుమతి తీసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ హయాంలో తిరుపతి అర్బన్ డెవలప్మంట్ బోర్డు చైర్మన్ గా.. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంబోర్డులో ఉండేవారు. ఆయన చాలా విషయాల్లో పెత్తనం చేసేవారు.
గత ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డు సభ్యునిగా పనిచేసిన సమయంలో, నెయ్యి కొనుగోలు టెండర్లు, సరఫరాదారుల ఎంపికలో జరిగిన అక్రమాల్లో ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించడంతో ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలకు కాంట్రాక్టులు దక్కడంలో రాజకీయ జోక్యం ఉందనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా కొనుగోలు కమిటీ నిర్ణయాలు, నాణ్యత పరీక్షల్లో తప్పుడు నివేదికల వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయనే అంశంపై చెవిరెడ్డి నుంచి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
విజయవాడ జైలుకు చేరుకున్న సీబీఐ సిట్ అధికారులు, నిబంధనల ప్రకారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. నెయ్యి సేకరణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ప్రాథమిక ఆధారాలు ఉన్నందున బోర్డు సభ్యుడిగా ఆయన పాత్రపై అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ విచారణలో, నెయ్యి నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను బోర్డు ఎందుకు పట్టించుకోలేదనే అంశంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
