సింగరేణి కాలరీస్ సంస్థలో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమాలపై సీబీఐ ( విచారణకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడg. కేసీఆర్ హయాంలో సింగరేణిని రాజకీయ అవసరాలకు వాడుకున్నారని, సంస్థ ఆర్థిక స్థితిగతులను దెబ్బతీశారని ఆరోపించారు. తాడిచర్ల బొగ్గు గనిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, అప్పట్లో నిబంధనలను తుంగలో తొక్కి తమకు అనుకూలమైన వారికి మేలు చేశారని మండిపడ్డారు.
ప్రస్తుతం ఒడిశాలోని నైని బొగ్గు గని టెండర్ల విషయంలో కాంగ్రెస్ నేతలు కూడా అదే చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు నైని గని టెండర్లను రద్దు చేయడం ద్వారా తమ మధ్య ఉన్న అంతర్గత విభేదాలను బయట పెట్టుకుందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకరినొకరు రక్షించుకుంటూ డ్రామాలు ఆడుతున్నాయని, విచారణకు మాత్రం ముందుకు రావడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ప్రతిపాదనలు పంపిస్తే..కేంద్రం పరిశీలిస్తుందన్నారు.
సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానిది ఉన్నప్పటికీ, మెజారిటీ వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వమే పరిపాలనను నియంత్రిస్తుందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో జరిగిన పాత, కొత్త అక్రమాలపై సీబీఐ విచారణకు అంగీకరిస్తూ లేఖ రాస్తే, మరుక్షణమే కేంద్రం విచారణకు ఆదేశిస్తుందని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ రూ. 30 వేల కోట్లను చెల్లించకపోవడం వల్ల సంస్థ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని కేవలం రాజకీయ లబ్ధి కోసమే రెండు పార్టీలు సింగరేణిని వివాదాల్లోకి నెడుతున్నాయని, దీనికి చట్టబద్ధమైన విచారణే ఏకైక మార్గమని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
