కరూర్ తొక్కిసలాట ఘటన బాధ్యుడు విజయేనని సీబీఐ చార్జిషీటు దాఖలు చేయబోతోందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం కరూర్ లో ఎన్నికల ప్రచారాన్ని జననాయగన్ షూటింగ్ తో విజయ్ ముడిపెట్టారట. జన స్పందన దృశ్యాలను సినిమా కోసం షూట్ చేయాడనికి భారీగా జన సమీకరణ చేయడం.. విజయ్ ఆలస్యంగా రావడం వంటివి జరిగాయని సీబీఐ గుర్తించిందన్న ప్రచారం జరుగుతోంది. విజయ్ ఒంటరి పోటీ ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్‌పై సీబీఐ ఉచ్చు
గత ఏడాది కరూర్ లో జరిగిన సభలోభారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పసిపిల్లలతో సహా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ..రాజకీయ సభ ముసుగులో జనాన్ని సమీకరించి చిత్ర షూటింగ్ చేశారని గుర్తించినట్లుగా చెబుతున్నారు. విజయ్ టీమ్ కావాలనే అనుమతి లేని ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించిందని, భారీ జనసందోహం ఉన్న చోట కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని సీబీఐ గుర్తించిందని అంటున్నారు.
విజయ్‌కు పదేపదే నోటీసులు – ఛార్జ్‌షీట్ సిద్ధం
ఈ కేసులో ఇప్పటికే విజయ్ను సీబీఐ అధికారులు దిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు విచారించారు. కేవలం సాక్షిగా మాత్రమే కాకుండా, ఈ ఘోరకలికి బాధ్యుడిగా విజయ్ను ఎందుకు పరిగణించకూడదనే కోణంలో అధికారులు ఆయన్ని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కరూర్‌లో షూటింగ్ జరిగిన సమయంలో అక్కడ ఉన్న ఫుటేజీలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ ఆధారాల ప్రకారం, 41 మంది మరణానికి కారణమైన నిర్లక్ష్యంపై విజయ్‌తో పాటు ఆయన టీమ్ సభ్యులపై త్వరలోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం.
రాజకీయ వ్యూహంతో అసలు సమస్యలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, ఏ కూటమితోనూ పొత్తు లేకుండా ‘ఒంటరిగానే’ వెళ్తానని విజయ్ ప్రకటించిన వెంటనే ఈ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. ఒకవేళ విజయ్‌పై ఛార్జ్‌షీట్ నమోదైతే, అది ఆయన రాజకీయ భవిష్యత్తుపై , ఆయన చివరి సినిమా జననాయగన్ డుదలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజకీయాల్లోకి వెళ్లే ముందు తన ఇమేజ్ను పెంచుకోవడానికి తీసిన ఈ సినిమా, ఇప్పుడు విజయ్ను చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 41 మంది ప్రాణాల బలికి బాధ్యత ఎవరిది? సీబీఐ వేసే తదుపరి అడుగు విజయ్ను జైలు పాలు చేస్తుందా లేక రాజకీయంగా దెబ్బతీస్తుందా అన్నది మరో నెలరోజుల్లో క్లారిటీ రానుంది.


