టీడీపీ అధినేత చంద్రబాబు… తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. టీడీపీ పోటీ చేస్తున్న పదమూడు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహింగసభల్లో పాల్గొంటారు. అలాగే.. చంద్రబాబు.. టీడీపీ బరిలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. చంద్రబాబు ప్రచారానికి రాబోతున్న విషయాన్ని… తెలంగాణ రాష్ట్ర సమితి ముందుగానే గుర్తించింది. కాంగ్రెస్ తో కలిసి కూటమి కట్టినప్పటి నుంచే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు . చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అడ్డుకోవాలని ఖమ్మంలో పిలుపునిచ్చారు కూడా.
గ్రేటర్ పరిధిలో … తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది అని ఇప్పటికీ చెప్పుకోవడానికి ప్రధాన కారణం సీమాంధ్రులని అందరూ అనుకుంటారు. కానీ.. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో మినహా.. సీమాంధ్రులు మెజార్టీ స్థాయిలో లేరు. గెలుపోటముల్ని ప్రభావితం చేయగలరు. కానీ.. అందరూ ఏక తాటిపై తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తారన్న గ్యారంటీ కూడా లేదు. కానీ.. గ్రేటర్ పరిధిలో.. తెలుగుదేశం పార్టీకి.. చంద్రబాబుకు ఆదరణ ఉండటానికి కారణం.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో మారిన రూపులేఖలు… వెల్లువలా వచ్చి పడిన ఉపాధి అవకాశాలు.. మధ్యతరగతి ప్రజలు … గౌరవంగా బతకడానికి తగిన పరిస్థితులు రావడమే కారణమని చాలా మంది అభిప్రాయం. దీన్ని ఎవరూ తోసి పుచ్చలేరు కూడా. ఆ వర్గాల్లో ఇప్పటికీ.. టీడీపీకి, చంద్రబాబుకు ఆదరణ ఉంది.
చంద్రబాబు గట్టిగా ప్రచారం చేస్తే ఈ వర్గాలన్నీ టీడీపీకి మద్దతుగా నిలబడే అవకాశం ఉంది. అందుకే.. టీఆర్ఎస్ నేతలు … హైదరాబాద్ విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పుకొస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో.. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి విషయంలో.. తన కృషిని సగర్వంగా చెప్పుకోవడానికి చంద్రబాబు ఎప్పుడూ ఉత్సాహపడతారు. తాను హైదరాబాద్ లోని అవకాశాలను వివరించేందుకు… న్యూయార్క్ వీధుల్లో.. ఫైల్స్ మోసుకుంటూ….తిరిగిన విషయాన్ని ఘనంగా చెప్పుకుంటారు. తన కృషి వల్లే హైదరాబాద్ ఈ స్థితిలో ఉందని… చెప్పడంలో ఆయన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు ముద్రను ఎవరూ కాదనలేరు. అందుకే.. తెలుగుదేశం పార్టీ కూడా.. ఈ విషయాలనే గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. అయితే.. చంద్రబాబును చూపించి.. సెంటిమెంట్ రెచ్చగొట్టాలనుకుంటోంది.. టీఆర్ఎస్ మరి.. చంద్రబాబు ప్రచారంలో లాభం జరుగుతుందా..? నష్టం జరుగుతుందా..?