‘హిట్’ ఫ్రాంచైజీలో వస్తున్న మరో సినిమా ‘హిట్ 3’. ఇది వరకు వచ్చిన రెండు భాగాలకూ నాని కేవలం నిర్మాతగానే వ్యవహరించాడు. అయితే ఈసారి హీరో కూడా తానే. కాబట్టి అంచనాలు మూడింతలు అయ్యాయి. ఈసారి వెండి తెరపై రక్తం ఏరులై పారుతుందని టీజర్ చూస్తే అర్థమైంది. సినిమాలో అందుకు వంద రెట్లు ఉండబోతోందని టాక్. ఈ సినిమాలో హింస పీక్స్ అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సినిమాలకు సెన్సార్ దగ్గర ఇబ్బంది ఉంటుంది. అందుకే నాని ముందుగానే జాగ్రత్తలు పడుతున్నట్టు సమాచారం. మే 1న ఈ చిత్రం విడుదల అవుతుంది. సాధారణంగా విడుదలకు వారం ముందు సెన్సార్ జరుగుతుంది. ‘హిట్ 3’కి మాత్రం మూడు వారాల ముందే సెన్సార్ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే సెన్సార్ దగ్గర ఏమైనా ఇబ్బందులు వస్తే, కవర్ చేసుకొని, మళ్లీ రీ ఎడిట్ చేసుకొనే టైమ్ ఉంటుంది. లేదంటే రివైజింగ్ కమిటీకి వెళ్లే టైమ్ ఉంటుంది. అందుకే ముందుగా సెన్సార్ చేయించుకోవాలని భావిస్తున్నారు.
దానికి తగ్గట్టుగానే శుక్రవారం ఈ సినిమా సెన్సార్ ముందుకు వెళ్లిందని తెలుస్తోంది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోందని, ఈ సినిమాకు భారీగా కట్స్ పడే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఎక్కువ కట్స్ పడితే, అప్పుడు రివైజింగ్ కమిటీకి వెళ్లాలని, కొన్నే కట్స్ అయితే ఏదోలా సర్దుబాటు చేసుకోవచ్చని టీమ్ భావిస్తోంది. సోమవారం లోగా సెన్సార్ విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.