తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్లలో నిప్పులు రాజేసి రాజకీయ చలి మంటలు కాచుకునేందుకు కొన్ని పార్టీలు చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. కేంద్ర జలశక్తి చైర్మన్ ఆధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. ఇందులోరెండు రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రతినిధులతో పాటు కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల జల వ్యవహారాల నిపుణులు ఉంటారు. గతంలో ఇద్దరు మఖ్యమంత్రుల సమక్షంలో జరిగిన చర్చల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికి ఏర్పాటు చేశారు.
ఇటీవలి కాలంలో తెలంగాణలో జల రాజకీయాలు పెరిగాయి. దిగువ రాష్ట్రమైన ఏపీజల దోపిడీ చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటోంది. బనకచర్ల గురించి.. నల్లమల సాగర్ నుంచి ఆరోపణలు చేస్తున్నారు. అయితే అసలు అన్యాయంచేసింది బీఆర్ఎస్సేనని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సిద్దమయ్యారు. దీన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ బీఆర్ఎస్ అంతా ఆ కమిటీనే చూసుకుంటుందని తాము సైలెంట్ గా ఉంటామని జల రాజకీయాలు ఆపేసే అవకాశం లేదు. ఆ రాజకీయాలు అలాగే కొనసాగుతాయి. ఎందుకంటే జల వివాదాలు ఓ పట్టాన పరిష్కారమయ్యేవి కావు. ప్రభుత్వ పెద్దలకు నిజాలు తెలిసినా.. ఇతర పార్టీలు ప్రజల్ని రెచ్చగొడతాయి కాబట్టి తమకు అన్యాయం జరిగిపోతోందని తప్పక పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రజల్లో ఎవరు ఎక్కువ నీళ్ల సెంటిమెంట్ రగిల్చగలిగితే వారికే అడ్వాంటేజ్ అవుతుంది. ఎలాంటి కమిటీలు వేసినా.. జల రాజకీయాలను మాత్రం ఆపే అవకాశం లేదు.