మీడియా ప్రసారాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, దేశానికి వ్యతిరేకంగా వార్తలు, ఫేక్ వార్తల్ని అసలు ప్రసారం చేయవద్దని, ప్రత్యక్ష ప్రసారాలు వద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే కొన్ని సంప్రదాయ మీడియాలు మాత్రం తగ్గడం లేదు. ఎంతో చరిత్ర ఉన్న ది హిందూ కవరేజీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ లోని ది డాన్ తరహాలో వార్తలు రాస్తోందని భారత్ ను అవమానిస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. హిందూను బ్యాన్ చేయాలని అంటున్నారు.
ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత ఓ రోజు వచ్చిన హెడ్ లైన్ చూసి.. హిందూ పత్రిక డైరక్టర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఆ పత్రిక తీరు మారలేదు. తాజాగా భారత ఫైటర్ జెట్ కూలిపోయిందని ఫేక్ ఫోటోలతో ట్వీట్ చేశారు. అవి పాత ఫోటోలు. ఇక ఆన్ లైన్ మ్యాగజైన్ ది వైర్ గురించి చెప్పాల్సిన పని లేదు. కమ్యూనిస్టు భావజాలంతో ఉండే ఆ ఆన్ లైన్ మ్యాగజైన్ మోడీని వ్యతిరేకిస్తుంది. అయితే ఇప్పుడు ఆ వ్యతిరేకతను దేశానికి వ్యతిరేకం అన్నట్లుగా మార్చేసింది. పాకిస్తాన్ వైపు అనుకూలంగా ఉండేలా ఫేక్ న్యూస్ వైరల్ చేస్తూండటంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ప్రభుత్వం ఆంక్షలు విధించిందని భావ ప్రకటనా స్వేచ్చ కోసం పోరాడతామని ఆ సంస్థ ప్రకటన చేసింది. అయితే.. రాజకీయాల విషయంలో ప్రజల నుంచి సపోర్టు వస్తుందేమో కానీ.. ఇలాంటి విషయాల్లో మాత్రం సపోర్టు రాదు. ఇప్పటికే భారత్ కు వ్యతిరేకంగా వార్తలు కవర్ చేస్తున్న బీబీసీకి కేంద్రం గట్టి వార్నింగ్ తో లేఖ రాసింది. వీటి తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకోవచ్చు. ప్రజలు కూడా వ్యతిరేకించే వాతావరణం ఇప్పుడు లేదు.