కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన అంశంపై కేంద్రం జోక్యం చేసుకుంటోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో ఈ కమిటీ సమీక్ష నిర్వహించనుంది. అనంతరం మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించనుంది. ఈ క్రమంలో బ్యారేజీ వద్ద అధికారులు 144 సెక్షన్ విధించారు. అనంతరం దీనిపై పూర్తి నివేదికను నిపుణుల కమిటీ కేంద్ర జలశక్తి శాఖకు అందించనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ శనివారం ఒక్కసారిగా కుంగింది. భారీ శబ్దంతో బీ – బ్లాకులోని 18, 19, 20, 21 ఫిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఓ అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20 ఫిల్లర్ కుంగడంతోనే వంతెన కుంగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బ్యారేజీ పొడవు 1.6 కి.మీ ఉండగా, సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. బ్యారేజీ అకస్మాత్తుగా కుంగడంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.
వంతెన కుంగడం వల్ల బ్యారేజీ మొత్తానికి ముప్పు ఏర్పడిందనే అంచనాలు ఉన్నాయి. ఇది అత్యంత ఖరీదైన ప్రాజెక్టు కావడం. ఎన్నికల సమయంలో… కుంగడంతో.. ఈ అంశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.