కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల్ని ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన దాదాపు 45మందికి కేంద్రం ఈ అవార్డుల్ని అందజేయనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 11మంది ఈ పురస్కారాలకు ఎంపిక అయ్యారు. సినీ రంగం నుంచి రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్నారు.
నటకిరీటిగా గుర్తింపు సాధించిన రాజేంద్ర ప్రసాద్ దశాబ్దాలుగా తెలుగువారిని నవ్విస్తూనే ఉన్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి, ఆ తరవాత హీరోగా వెలుగొంది వందల చిత్రాల్లో వినోదాల్ని పంచారు. ఆ ఒక్కటీ అడక్కు, అప్పుల అప్పారావు, బృందావనం, మేడమ్, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ ఫస్ట్ విడుదల, లేడీస్ టైలర్.. ఇలా రాజేంద్రుడి కెరీర్లో క్లాసిక్స్ ఎన్నో. ఆ నలుగురు సినిమాతో తన రూటు మార్చారు. కథాబలం ఉన్న పాత్రలకు కేరాఫ్ గా నిలిచారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా కొనసాగుతున్నారు.
మురళీ మోహన్ నటుడిగా, నిర్మాతగా విభిన్న పాత్రలు పోషించారు. రియల్ ఎస్టేట్స్ లోకి వెళ్లాక సినిమాలు బాగా తగ్గించారు. ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామా చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్స్. దాసరి నారాయణరావు ప్రియశిష్యుడిగా ఆయన సినిమాల్లో విలువైన పాత్రల్ని దక్కించుకొన్నారు. అజాత శత్రువుగా పేరొందారు. టీడీపీకి చేరువై.. ఆ పార్టీకి తన వంతు సేవ చేశారు. ఇప్పుడు మళ్లీ సినిమా రంగం వైపు దృష్టి సారిస్తున్నారు.
* పద్మ అందుకోబోతున్న తెలుగువారు
1.చంద్రమౌళి గడ్డమణుగు – తెలంగాణ – సైన్స్ అండ్ ఇంజినీరింగ్
2. దీపికా రెడ్డి – తెలంగాణ – కళ
3. గద్దె బాబు రాజేంద్రప్రసాద్ – ఆంధ్రప్రదేశ్ – కళ
4. గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్( మరణానంతరం) – ఆంధ్రప్రదేశ్ – కళ
5. గూడురు వెంకట్రావు – తెలంగాణ – వైద్యం
6. కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ – తెలంగాణ – సైన్స్ అండ్ ఇంజినీరింగ్
7. కుమారస్వామి త్యాగరాజన్ – తెలంగాణ- సైన్స్ అండ్ ఇంజినీరింగ్
8. మాగంటి మురళీ మోహన్ – ఆంధ్రప్రదేశ్ – కళ
9. పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి – తెలంగాణ – వైద్యం
10. రమారెడ్డి మామిడి(మరణానంతరం) – తెలంగాణ
11. వెంపటి కుటుంబ శాస్త్రి – ఆంధ్రప్రదేశ్ – సాహిత్యం