కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా తెలుగు అధికారి సంజయ్ మూర్తి నియామకం కావడం బ్యూరోక్రసీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మాములుగా ఈ పదవిని బీజేపీ పెద్దలు అత్యంత సన్నిహితులుకే ఇస్తారు. ప్రస్తుతం పదవి విరమణ చేస్తున్న ముర్ము జమ్మూకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ గా చేశారు. అయినా కాగ్ గా నియమించారు. ఇప్పుడు తెలుగు అధికారిని నియమించారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ .. కాంగ్రెస్ పార్టీతో లింక్ ఉంది. అయినా ఆయనకు కాగ్ పదవి రావడం వెనుక కూటమిలో కీలకంగా ఉన్న తెలుగు పార్టీలే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో కేంద్రంలోని కీలక పదవుల్లో దక్షిణాది వారికి పెద్దగా ప్రాధాన్యం దక్కేది కాదు. ఎందుకంటే వారి కోసం లాబీయింగ్ చేసేంత బలం ప్రాంతీయ పార్టీలకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కేంద్రంలో కీలక వ్యక్తులుగా ఉన్నారు. వారు కావాలని అనుకుంటే.. ఎవరికైనా పదవి ఇప్పించగలరు. అందుకే కాగ్ తో పాటు ముందు ముందు మరికొన్ని కీలక రాజ్యాంగపరమైన పదవులు తెలుగువారికి.. దక్షిణాది వారికి లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
చంద్రబాబునాయుడు… తాము కూటమిలో కీలకం అన్న విషయాన్ని అంతర్గతంగానే ఉంచుకుంటున్నారు. ఎక్కడా మోదీకి గుర్తు చేయడం లేదు. తాము ఎన్డీఏకు పిల్లర్ అని.. అంటున్నారు. అసలు చిన్న హెచ్చరిక చేసేందుకు కూడా ఆయన సిద్ధంగా లేరు. మరో కీలక పార్టీ నితీష్ కుమార్ అప్పుడప్పుడూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమికి దూరమయ్యేది లేదని అంటున్నారు. చంద్రబాబు ఇలా మంచిగా ఉంటూనే అన్ని పనులు చక్కబెట్టుకోవాలని అనుకుంటున్నారని … బెదిరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయనకు స్పష్టత వచ్చిందని అనుకుంటున్నారు.