కేంద్ర ప్రభుత్వం మనీ గేమింగ్ యాప్స్ ను బ్యాన్ చేస్తూ చట్టం చేసింది. బెట్టింగ్ వ్యాపారాన్ని ఇలా గేమింగ్ యాప్స్ పేరుతో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇవి ఏ స్థాయికి వెళ్లాయంటే చివరికి టీమ్ ఇండియాకు స్పాన్సర్ చేసేంత స్థాయికి వెళ్లాయి. వీటి బారిన పడి వ్యసనంగా మార్చుకున్నవారు ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. పదుల సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం చివరికి బ్యాన్ చేయాలని డిసైడయింది. పార్లమెంట్ లో బిల్లు ఆమోదించి.. చట్టంగా మార్చేశారు. దీంతో మనీ గేమ్ కంపెనీలన్నీ తమ యాప్స్ ను ఆపేస్తున్నట్లుగా ప్రకటించాయి. కానీ సమస్య మాత్రం పరిష్కారమైనట్లు కాదు.
నిషేధం పేపర్లలో మాత్రమే ఉండకూడదు..!
మన దేశంలో ఓ దరిద్రమైన సంప్రదాయం ఉంటుంది. ప్రజలకు కష్టాలు కలిగించే వాటిని పాలకులు నిషేధిస్తారు. కానీ అవేమీ ఆగిపోవు.. యధేచ్చుగా జరిగిపోతూనే ఉంటాయి. కానీ నిషేధం పేరుతో వాటిని డబుల్ రేట్లకు అమ్ముతారు. అలా చేయడం వల్ల.. ప్రభుత్వానికి ఆదాయం రాదు. కానీ ఈ మధ్యలో అమ్మేవారు.. వాటిని అమ్ముతున్నా చూసీ చూడనట్లుగా ఉండేవారు పెద్ద ఎత్తున డబ్బులు పిండుకుని బతికేస్తారు. ఉదాహరణకు గుట్కాను తీసుకోవచ్చు. గుట్కాను దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు. అయినా గుట్కా దొరకని చోటు ఎక్కడైనా ఉందా ?. కాకపోతే గతంలో పది రూపాయలకు అమ్మేవారు ఇప్పుడు యాభై రూపాయలకు అమ్ముతూంటారు.
ఎన్నో అనుమతి లేని బెట్టింగ్ యాప్స్
నేరుగా గేమింగ్ పేరుతో అనుమతి తీసుకుని ఆ పేరుతో బెట్టింగ్ యాప్స్ నిర్వహించారు. ఇప్పుడు అలాంటి అనుమతి తీసుకున్నవేమీ కనిపించవు. కానీ అనుమతి లేనివి ఉండకూడదని రూల్ ఏమీ లేదు. అనుమతి లేకుండా ఏదో ఓ పేరుతో ఈ బెట్టింగ్ వ్యాపారాన్ని కొనసాగించే ముదుర్లు ఉంటారు. ఇలాంటి వాటిని గుర్తించి .. కఠినంగా వ్యవహరించాల్సిన వ్యవస్థను కేంద్రమే నిర్మించాల్సి ఉంటుంది. లేకపోతే.. ఈ గేమింగ్ యాప్స్ ను బ్యాన్ చేయడం వల్ల ప్రత్యేకంగా ప్రజలకు ఎలాంటి లాభం ఉండదు.
ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధే ముఖ్యం
ఓ చట్టం చేయడం కాదు.. దానిలో లోపాలు లేకుండా చూసుకోవాలి. ఏదో రూపంలో చట్టానికి చిల్లు పెట్టేలా రూల్స్ ఉంటే ప్రయోజనం ఉండదు. అదే సమయంలో అమలు కూడా పటిష్టంగా ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించాలనుకునేవారు దొరికిపోతే నాశనమైపోతామన్న భయానికి వచ్చేలా అమల ఉండాలి. గేమింగ్ యాప్స్ ను బ్యాన్ చేసిన నిర్ణయాన్ని కేంద్రం అంత పక్కాగా అమలు చేస్తుందని…. వేరే దారులు వెదుక్కునే వారికి చాన్స్ ఇవ్వకుండా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు.