పెట్రో ధరల పెంపునకు కేంద్రం నరేటివ్ రెడీ చేస్తోంది. పెరిగిపోయిన క్రూడాయిల్ ధరలల వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా సుమారు రూ. 30,000 కోట్ల మేర భారీ నష్టాలను చవిచూస్తున్నాయని ప్రచారం ప్రారంభించింది. అంటే ఈ నష్టాల్లో కొంత భాగం ప్రజలపై నెట్టేందుకు సిద్ధమయ్యారన్నమాట.
ప్రతి రోజూ రూ. 700 – 1,000 కోట్ల భారం
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును దాటింది. పెట్రోలియం శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ , భారత్ పెట్రోలియం , హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ప్రతిరోజూ సుమారు రూ. 700 నుండి 1,000 కోట్ల వరకు నష్టపోతున్నాయి. ముఖ్యంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 18, డీజిల్‌పై రూ. 25 వరకు ఈ కంపెనీలు అదనపు భారాన్ని మోస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ, అంతర్జాతీయ ధరల పెరుగుదల ముందు అది సరిపోవడం లేదని అంటున్నారు.
రేట్లు పెంచక తప్పని స్థితి
చమురు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు భారీ నష్టాలతో నిండిపోతుండటంతో, కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ముడి చమురు దిగుమతి వ్యయం పెరగడం, ఫ్రైట్ చార్జీలు , బీమా ప్రీమియంలు రెట్టింపు అవ్వడంతో చమురు కంపెనీలు తమ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్లను కూడా మార్చుకోవాల్సి వస్తోంది. ప్రపంచ దేశాలైన జపాన్, బ్రిటన్, జర్మనీలలో ఇప్పటికే ఇంధన ధరలు 30 శాతం వరకు పెరిగినా, భారత్‌లో మాత్రం గత ఫిబ్రవరి నుంచి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, ఈ స్తబ్ధత ఎంతో కాలం కొనసాగేలా కనిపించడం లేదు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్.. అన్నీ ఖరీదే!
కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ సరఫరా విషయంలో కూడా కంపెనీలు భారీ సబ్సిడీ భారాన్ని మోస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ధరలను నియంత్రిస్తున్నప్పటికీ, చమురు కంపెనీల నష్టాలు రూ. 30 వేల కోట్లకు చేరాయి కాబట్టి ఈ భారాన్ని సర్దుబాటు చేయాలంటే ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సిందే. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గని పక్షంలో సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయమని స్పష్టమవుతోంది. రాబోయే వారాల్లో ప్రభుత్వం ఇంధన ధరల విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
