కేంద్రబడ్జెట్ రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వొళ్ళు మండిపోతుంది. బిజెపి మిత్రపక్షమైన తెలుగుదేశం నేతలకు మింగలేని కక్కలేని వికారంతో తలతిరుగుతున్నట్టు వుంది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో నెలకొల్పామని, ఎపి విద్యా హబ్‌గా తయారౌతుందని కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు సాగించారు. నిధుల కేటాయింపుల తీరుతెన్నుల్ని చూస్తే పాతికేళ్లు గడిచినా ఈ విద్యా సంస్థల నిర్మాణం పూర్తి కావు. తిరుపతిలో నెలకొల్పిన ఐఐటికి రూ.700 కోట్లు వ్యయం చేస్తేనే పూర్తవుతుంది. ఈ బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించారు. ఇప్పటికే హైదరాబాదులో నిర్మాణం జరిగి పని చేస్తున్న ఐఐటికి రూ.75 కోట్లు కేటాయించారు. ఐఐఎస్‌ఇఆర్ తిరుపతిలో నెలకొల్పారు. రూ.1,500 కోట్లు ఖర్చుపెడితేనే ఇది పూర్తవుతుంది. కానీ బడ్జెట్‌లో రూ.50 కోట్లు మాత్రం పెట్టారు. పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా మంగళగిరిలోని ఎయిమ్స్‌కు బడ్జెట్‌లో చిల్లిగవ్వ లేదు. అనంతపురంలో కేంద్రీయ యూనివర్సిటీకి ఇప్పటి వరకు రూ.11 కోట్లు ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో పైసా చూపలేదు. వైజాగ్‌లోని ఐఐఎంకు ఇదే దుర్గతి పట్టింది.
గత రెండు బడ్జెట్లలాగే ఈ బడ్జెట్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎపిని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించలేదు. అన్ని రాష్ట్రాలతో సమానంగానే వ్యవహరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఐదేళ్ల తరువాత కూడా రూ.2,499 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం తెలియజేసిన విషయం విదితమే. తుదకు పొరుగునే ఉన్న తమిళనాడు రూ.82 వేల కోట్ల మిగులులో ఉంటుంది. అయితే తమిళనాడు రాష్ట్రాన్ని చూపెట్టి ఎపికి ప్రత్యేక హోదా లేకుండా చేశారు. అయినా బడ్జెట్‌లో ఎపికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ లేవు. మాటల్లో మాత్రం ఎపి తమకు ప్రత్యేక రాష్ట్రమని చెబుతుంటారు.
మాటలు కోటలు దాటిస్తున్న ప్రత్యేక ప్యాకేజీ వస్తుందో రాదో తెలియదు కానీ, రాష్ట్ర విభజన చట్టం 46(3) ప్రకారం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అమలు జరగాల్సి ఉంది. మూడేళ్లు గడిచినా రూ.1,050 కోట్లు విదిల్చి కేంద్రం చేతులు దులుపుకుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడు జిల్లాలు దాదాపు 2.2 కోట్ల జనాభా గల ప్రాంతాలు. మరి ఈ ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఈ బడ్జెట్‌లో కూడా ప్రస్తావనకు రాకుండా కేంద్రం ద్రోహం చేస్తే వీరికి జరిగిన అన్యాయం గురించి ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా వున్నారు?
రాజధాని నిర్మాణానికి కూడా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. రాష్ట్ర విభజన చట్టం 94(3) ప్రకారం రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, తదితర అవసరమైన మౌలిక వసతుల నిమిత్తం కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉంది.
వెంకయ్యనాయుడు అదేపనిగా వాయిస్తున్న ప్రత్యేక ప్యాకేజీకి ”డప్పు” కి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలూ లేవు. ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఒకవేళ ఆమోదించినా ఈ పథకానికి నిధులు ఏ విధంగా లభిస్తాయో కేంద్రం వద్ద ముఖ్యమంత్రి తరపున లాబీయింగ్ చేసే కేంద్ర సహాయ మంత్రి సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ కూడా చెప్పగలస్ధితిలోలేరు.
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 46(2) ప్రకారం రాష్ట్ర వనరుల లోటు పూడ్చడానికి గ్రాంటు ఇవ్వాల్సి ఉంది. అందుకే 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో అప్పటి ప్రధాన మంత్రి రాష్ట్ర విభజన అమలులోకి వచ్చిన తేదీ నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు కేంద్రం ఆమోదం పొందే వరకు ఎపిలో తొలి సంవత్సరం బడ్జెట్ లోటును కేంద్రం భర్తీ చేస్తుందని చెప్పారు. ఈ హామీ నోటి మాట కాదు. చట్టంలో పేర్కొన్న అంశమే. ఈ లోటు విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గణాంకాలు పలుమార్లు చక్కర్లు కొట్టాయి. గవర్నర్ పాలనలో రూ.16 వేల కోట్లుగా నిర్ధారించారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ తామెందుకు భరిస్తామని కేంద్రం అడ్డం తిరిగింది. తాజాగా ఇందుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు.
ఏపి నుంచి రైల్వే మంత్రికి రాజ్యసభలో సభ్యత్వ మిచ్చారు. రైల్వేజోన్ ఖాయమన్నారు. ఈ బడ్జెట్‌లో హుష్ కాకి అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్న తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని వాగ్దానాలు చేశారు. ఈ బడ్జెట్‌లో అసలు ఊసే లేదు.
పోలవరం ప్రాజెక్టు కథ మరీ మాయగా వుంది. కేవలం నాబార్డు రుణంతో సరిపెట్టారు. కానీ, నాబార్డుకు పెట్టుబడి నిధి క్రింద రూ.9,020 కోట్లు కేటాయించారు. ఈ నిధుల నుంచే నాబార్డు జాతీయ హోదా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్లు నాబార్డు నుంచి నిధులు ఎంత వరకు లభిస్తాయి. రూ.16 వేల కోట్లు అంచనా ప్రకారం ఇంకా రూ.3,829 కోట్లు రాష్ట్రానికి రావాలి. పైగా ప్రాజెక్టు అంచనాలు పెరిగితే నీతి ఆయోగ్ అమోదం పొందాలి. ఇదంతా ఎక్కడికి లెక్కతేలుతుందో ఎప్పటికి పూర్తవుతుందో చెప్పగలవారు లేరు.
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లతో పాటు రాష్ట్ర పురోభివృద్ధి తీవ్రంగా కుంటుబడటమే నేడు అసలు సమస్య. వాస్తవంలో జనవరి నెల జీతాలు ఫిబ్రవరి 1వ తారీఖున చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. బడ్జెట్ తర్వాత ముఖ్యమంత్రి వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆయన అస్తవ్యస్త ఆలోచనా రీతులు భయంగొల్పే విధంగా ఉన్నాయి. రాజధాని రైతులు తనను నమ్మి భూములు ఇచ్చారని, ఈ బడ్జెట్‌లో వారికి న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తపరిచారు. కానీ, రాష్ట్రంలో కరువుకాటకాలతో, వలస బతుకులతో నరకం చూస్తున్న రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రైతులు ముఖ్యమంత్రిని నమ్మి ఓట్లు వేయలేదా? బడ్జెట్‌లో వారికి జరిగిన అన్యాయం గురించి మాట మాత్రంగానైనా ముఖ్యమంత్రి ప్రస్తావించనే లేదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వతంత్రంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించదు. అలాగని ఆయన్ని దూరం చేసుకునే పరిస్ధితులను కూడా బిజెపి అనుమతించదు.
సూటిగా చెప్పాలంటే పైకి చెప్పుకోలేని విధంగా కేంద్రం – బాబు ని గదిలో పెట్టి కుమ్మేస్తోంది. అయితే, ఇది ఆంధ్రప్రదేశ్ ను అవమానించడమే అన్న వాస్తవాన్ని బిజెపి మరచిపోతోంది.