దేశంలో టెలివిజన్ చానళ్లకు ఇచ్చే టీఆర్పీ రేటింగులను నిలిపివేయాలని బార్క్ ను కేంద్రం ఆదేశిచింది. యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై వార్తా ప్రసారాలు ఎలా ఉండాలో వివరిస్తూ ప్రభుత్వం పక్కా ఆదేశాలను జారీ చేసింది. యుద్ధం పరిణామాలను కొన్ని మీడియా ఛానళ్లు రియాలిటీ షో ల స్థాయికి దిగజార్చడంపై కేంద్ర సమాచార శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం TRP రేటింగుల కోసం వాస్తవాలను వక్రీకరిస్తూ, వీక్షకులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న కథనాలను తక్షణమే నియంత్రించాలని ఆదేశించింది.
సర్కస్‌గా మారుతున్న మీడియా షోలు
మీడియా అనేది సమాజానికి దిక్సూచిలా ఉండాలి కానీ, ప్రజలను పానిక్ లోకి నెట్టే యంత్రంలా మారకూడదు. గతంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు, దేశంలో నెలల తరబడి సరిపడా చమురు, నిత్యావసర వస్తువుల నిల్వలు ఉన్నప్పటికీ.. కొన్ని మీడియా సంస్థలు చేసిన అతి ప్రచారం వల్ల సామాన్యులు బెంబేలెత్తిపోయారు. ఒక్క రోజులోనే పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్ల ముందు కిలోమీటర్ల మేర క్యూలు కట్టేలా చేసి, కృత్రిమ కొరత సృష్టించడానికి కుట్ర చేశారు. వాస్తవాలను విశ్లేషించి ప్రజల్లో భరోసా నింపాల్సిన బాధ్యతను మరిచి, సంచలనం కోసం పాకులాడటం వల్ల వ్యవస్థలే కుప్పకూలే ప్రమాదం ఏర్పడుతోంది.
ఇప్పుడు కూడా అంతే !
ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న అంతర్జాతీయ గొడవలను కూడా మన దేశానికి అన్వయిస్తూ కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారం అత్యంత దారుణంగా ఉంది. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సహజంగానే పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో ఎగుమతి, దిగుమతులపై కొంత ప్రభావం ఉంటుంది. కానీ, దీనివల్ల దేశం మొత్తం ఆకలితో అలమటిస్తుందని, నిత్యావసరాలు దొరకవని చిత్రీకరించడం వెనుక దురుద్దేశం కనిపిస్తోంది. కేవలం గుడ్లు లేదా కొన్ని చిన్నపాటి వస్తువుల ఎగుమతులు ఆగితేనే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోందన్నట్లుగా కథనాలు అల్లడం దేశంపై చేస్తున్న దాడి లాంటిదే.
సమృద్ధిగా చములు, ఆహార నిల్వలు
దేశంలో చమురు నిల్వలు , ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా, మీడియా మాత్రం రేపు ఏం జరుగుతుందో అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల ప్రజలు అనవసరంగా వస్తువులను నిల్వ చేయడం మొదలుపెడతారు, ఫలితంగా నిజమైన ధరల పెరుగుదల సంభవిస్తుంది. మీడియా సృష్టించే ఈ కృత్రిమ భయం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలే బలి అవుతున్నారు. నిజానికి యుద్ధం మన గడపలో లేకపోయినా, మీడియా వార్తల వల్ల ప్రతి ఇంట్లోనూ అశాంతి నెలకొంటోంది.
బాధ్యతారాహిత్య మీడియాకు బుద్ధి చెప్పాలి!
ఇలాంటి బాధ్యతారాహిత్య మీడియాకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలు స్వచ్ఛందంగా అవాస్తవాలను ప్రచారం చేసే ఛానెళ్లను , బహిష్కరించాలి. ఏది నిజం, ఏది సంచలనం కోసం చేస్తున్న ప్రచారం అనేది విజ్ఞతతో ఆలోచించాలి. అదే సమయంలో, ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా తప్పుడు వార్తలు ప్రసారం చేసే సంస్థలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. సమాచార స్వేచ్ఛ అంటే సామాన్యుడి ప్రశాంతతను దెబ్బతీయడం కాదని మీడియా గ్రహించాలి. నిజమైన జర్నలిజం అంటే సమస్య తీవ్రతను వివరించడమే కాదు, ఆ సమస్యను ఎదుర్కోగల శక్తి మనకు ఉందని ప్రజల్లో ధైర్యాన్ని నింపడమని గుర్తించాల్సి ఉంది.
