గో`దారి’కి రాని కేంద్ర పెద్దలు !

గోదావరి మహా పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటున్నా కేంద్ర పెద్దల్లో చాలామంది గో`దారి’బాట పట్టడంలేదు. పుష్కరాలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేయడంతోపాటుగా, కేంద్ర మంత్రులనూ, బిజేపీ పెద్దలను ప్రత్యేకంగా ఆహ్వానించింది. 144 సంవత్సరాలకొకసారి వచ్చే ఈ మహా పుష్కరాలకోసం తమ రాష్ట్రానికి వచ్చి పుణ్యస్నానాలు చేయవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుసహా మంత్రులు ఢిల్లీ పెద్దలను పేరుపేరునా ఆహ్వానించారు. స్వయంగా ఆహ్వానపత్రికలు అందజేసినా చాలా మంది కేంద్ర పెద్దలు రాకపోవడం తెలుగుదేశం పార్టీ శిబిరాల్లో చర్చనీయాంశమైంది.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి తెలుగింటి కోడలు అయిన నిర్మలా సీతారామన్ కూడా ఏ కారణం వల్లనే పుష్కరాలకు రానేలేదు. ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ సతీమణి. అయితే, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మరో మంత్రి ప్రకాష్ జయదేవకర్ మాత్రం గోదావరి పుష్కరస్నానాలు ఆచరించారు.

కేంద్ర పెద్దలను అంత ఆర్భాటంగా పిలిచినా ఎందుకని ఎక్కువ సంఖ్యలో వారు తరలిరాలేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహా పుష్కరాలను నిర్వహిస్తుంటే, `మిత్రులమని’ చెప్పే ప్రధానమంత్రి మోదీ, ఇంకా కేంద్ర బీజేపీ పెద్దలు ,అద్వానీ, అమిత్ షా వంటివారు కూడా గోదారి బాట తొక్కనేలేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు జరగుతున్నందున ఒక చోటకు వెళితే మరో రాష్ట్ర ఏలికలు చిన్నబుచ్చుకునే అవకాశాలున్నందున దూరంగా ఉండటమే శ్రేయస్కరమని కేంద్ర పెద్దలు భావించారా ? ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ గారు కూడా ఏదైనా సలహా ఇచ్చి ఉంటారన్న సందేహాలు టిడిపీ వర్గాల్లో పొడచూపుతున్నాయి. అసలే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్యలేక మాటల వాగ్యుద్ధానికి చిటికీమాటికీ దిగుతుంటే పుష్కరాలకు వెళ్లి లేనిపోని ఇబ్బందులు కోరి తెచ్చుకోవడం కంటే, మౌనంగా ఉండటమే మంచిదని భావించి ఉండవచ్చు.

కేంద్ర పెద్దలకు ప్రత్యేక ఆహ్వానాలు అందించే విషయంలోనేకాదు, విదేశీయులను పెద్ద సంఖ్యలో రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా వారు కూడా అంతగా స్పందించలేదు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పించినా, తొలి రోజునే రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం, ఆ తర్వాత అగ్నిప్రమాద సంఘటన చోటుచేసుకోవడంతో విదేశీయులు పుష్కరఘాట్ లవైపు కన్నెత్తి చూడలేదని తెలుస్తోంది.

మొత్తానికి వివిఐపీలు ఎంత తక్కువ మంది వస్తే అంత మంచిదని క్రిందిస్థాయి అధికారులు మొదటి నుంచీ అనుకోవడం గమనార్హం. ప్రతి రోజూ యాత్రికులను కంట్రోల్ చేయడానికే సమయం సరిపోవడంలేదనీ, అలాంటప్పుడు విఐపీలు క్యూ కడితే వారికోసం పరుగులు పెడుతుంటే, అటు సామాన్యుల సౌకర్యాలు, భద్రత అంతగా పట్టించుకునే సమయం దొరకదనీ, అలాంటప్పుడు మరింతగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు బాహాటంగానే అంటున్నారు. ఏదైతేనేం, పుష్కరాల ముగింపు దగ్గర పడుతుండటంతో అంతా ఇప్పుడు రిలీఫ్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com