రాజధానిపై అంతుబట్టని జగన్‌, కేంద్రం వ్యూహాలు…!

మూడు రాజధానులు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ వ్యూహం ఏమిటనేది సామాన్య ప్రజలతోపాటు ప్రతిపక్షాలకూ అంతుపట్టడంలేదు. అమరావతి నుంచి రాజధాని తరలించడం తథ్యమని వైకాపా నేతలు, మంత్రులు రోజూ చెబుతూనే ఉన్నారు. రాజధాని మార్పును ఎవరూ అడ్డుకోలేరని అంటున్నారు. అదే సమయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. మరో పక్క రాజధాని తరలింపునకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అధికారపక్షం ఒక్కటీ ఒకవైపు, ప్రతిపక్షాలన్నీ మరోవైపు మోహరించి ఉన్నాయి.

రాజధాని తరలింపు తథ్యమని అధికార పక్షం నేతలు బల్ల గుద్ది చెబుతుండగా, అది అసంభవమని, ఎట్టి పరిస్థితిలోనూ జరగదని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. రాయలసీమ నాయకులు కూడా అమరావతిని వ్యతిరేకించడంలేదు. రాజధాని ఉంచితే అమరావతిలో ఉంచాలని లేదా రాయలసీమను రాష్ట్రంగా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజధాని మారుస్తూ నిర్ణయం తీసుకోగానే ఉద్యమం ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఎవరేమన్నా ముఖ్యమంత్రి జగన్‌ పెదవి విప్పకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు.

అమరావతి ఒక్క అంగుళం కూడా కదలదని, తరలిపోయే సమస్యే లేదని చెబుతున్న ప్రతిపక్ష నాయకులకు, ప్రత్యేకించి బీజేపీ నేతలకు జగన్‌ ఎలాంటి వ్యూహం పన్నుతున్నాడో అర్థం కావడంలేదు. కొన్ని రోజుల కిందట బీజేపీ నేతలు తలా ఒక మాట మాట్లాడినా అమరావతికి స్పష్టమైన మద్దతు ఇస్తూ తీర్మానం చేశాక అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. వాళ్లు ఇప్పటివరకు అంటున్నది ఒక్కటే మాట. ‘రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించాక కేంద్రం జోక్యం చేసుకుంటుంది’ అంటూ తారక మంత్రంలా జపిస్తున్నారు. దీన్నే కొందరు కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఇదే చెప్పాడు. కాని కేంద్రం ఎలా అడ్డుకుంటుందో ఇప్పటివరకూ ఎవరూ చెప్పడంలేదు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో ఏముందో చెప్పాడు. విభజన చట్టంలోని సెక్షన్‌-6లో ఏముందంటే…అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌ అన్నీ ఒకే చోట ఉండాలి. అంటే రాజధాని ఎక్కడ ఉన్నా అన్నీ ఒక్కచోటనే ఉండాలి తప్ప తలా ఒకచోట ఉండకూడదన్న మాట. మరి ఇప్పుడు జగన్‌ చేస్తున్న పని విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉంది కదా. ఇలాంటప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలి కదా.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత కేంద్రం ఏ విధంగా జోక్యం చేసుకొని, ఎలా ఆపుతుందో నాయకులు చెప్పడంలేదు. జగన్‌ నిపుణుల సలహాలు తీసుకుంటూ న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులు రాకుండా మూడు రాజధానులు బిల్లు రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ బిల్లు ఎలా ఉండబోతున్నదో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ప్రభుత్వం లాంఛనంగా అధికార ప్రకటన చేయడమే తప్ప నిర్ణయం జరిగిపోయిందనేది బహిరంగ రహస్యం. ఈ విషయాన్ని ప్రభుత్వం దాయడంలేదు. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తాయని జగన్‌కు తెలియదా? వాటి చేతికి చిక్కేలా బిల్లు తయారుచేయడు కదా. రాజధాని తరలించడం తథ్యమని ప్రభుత్వం ఎంత గట్టిగా చెబుతున్నదో, కేంద్రం జోక్యం చేసుకుంటుందని బీజేపీ కూడా అంత గట్టిగానే చెబుతోంది. కేంద్రం జోక్యం చేసుకొని అడ్డుకుంటుందని టీడీపీ, ఇతర పార్టీలు నమ్ముతున్నాయి.

కాని దాని జోక్యం ఏవిధంగా ఉంటుందో తెలియడంలేదు. అమరావతిలో రాజధాని ఉండదు కాబట్టి ప్రభుత్వం సీఆర్‌డీఏను ఎత్తేస్తుందని, అందుకు సంబంధించిన బిల్లు సభలో ప్రవేశపెడుతుందని తెలుస్తోంది. ఈ బిల్లును నేరుగా ప్రవేశపెడితే మండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది కాబట్టి అడ్డుకుంటుంది. అందుకే దాన్ని మనీ బిల్లు రూపంలో మండలిలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. అలా ప్రవేశపెడితే టీడీపీ అడ్డుకోలేదంటున్నారు. అయితే సీఆర్‌డీఏ బిల్లును మనీ బిల్లుగా ప్రవేశపెట్టడం కుదరదని సుజనా చౌదరి చెప్పాడు. అమరావతి పరిణామాలన్నింటినీ కేంద్రం పరిశీలిస్తోందని, తప్పనిసరిగా జోక్యం చేసుకుంటుందని అన్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com