మెడికల్ కాలేజీల విషయంలో ఏపీ ప్రభుత్వ పీపీపీ ప్రయత్నాలను.. వైసీపీ అవినీతి అని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ అనే ఒప్పందంలో ఉండే విధివిధానాల గురించి చర్చ జరగకుండా చేసి కేవలం ప్రైవేటు అనే వాదన వినిపిస్తోంది. ఇదే ఆరోపణలతో రాజకీయం చేస్తోంది. కోర్టుకు వెళ్లడానికి రెడీ అంటున్నారు కానీ ఇంకా కోర్టుకు వెళ్లలేదు. కోటి సంతకాలు ఎక్కడున్నాయో వారికే తెలియాలి. ఆ సంతకాలు పెట్టిన కోటి మంది ఎక్కడున్నారో కూడా వారికి తెలియదు. అయితే ఇప్పుడు వారికి బ్యాడ్ న్యూస్ వచ్చింది. అదేమిటంటే.. పీపీపీకి కేంద్రం సపోర్టు చేస్తోంది. 40 శాతం ఆర్థికంగా సహకరించేందుకు సిద్ధమయింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ వచ్చింది.
పీపీపీ మోడల్‌కే కేంద్రం సపోర్టు
మెడికల్ కాలేజీల నిర్వహణ ఆషామాషీగా కాదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడం అషామాషీ కాదు. అలాగని ప్రైవేటు రంగానికి అన్నీ వదిలి పెట్టలేరు. అందు కోసమే పబ్లిక్, ప్రైవేటు పార్టనర్ షిప్ విధానం రూపొందింది. ఈ విధానం ద్వారా దేశంలో ఎన్నో మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మితం అయ్యాయి. హైదరాబాద్ మెట్రో కూడా అలాంటిదే. ఇప్పుడు ప్రభుత్వం చేతికి వస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఆస్తులు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తున్నాయి. మెడికల్ కాలేజీలను కూడా అలాగే అభివృద్ధి చేయాలని వైద్య విద్య ప్రమాణాలతో పాటు వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్రం నిర్ణయించింది.
పార్లమెంటరీ కమిటీదీ అదే సిఫారసు – వైసీపీ ఎంపీ కూడా సపోర్టు
పీపీపీ మోడల్ లోనే ఇక మెడికల్ కాలేజీలు పెట్టాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. ఆ స్థాయీ సంఘంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి సభ్యుడు. ఆయన కూడా రిపోర్టుపై సంతకం చేశారు. అంటే అధికారికంగా వైసీపీ కూడా పీపీపీకి సపోర్టు చేసింది. కానీ రాజకీయంగా మాత్రం తప్పుడు ఆరోపణలు చేసి లబ్ది పొందాలనుకుంటోంది. అందుకే విపరీత రాజకీయాలకు తెగబడుతున్నారు.
ఇప్పుడు కేంద్రంపై ఆరోపణలు చేసే ధైర్యం ఉందా?
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు తాము నలభై శాతం సాయం చేస్తామని కేంద్రం లేఖ రాయడంతో ఇప్పుడీ విధానంపై ఆరోపణలు చేసే వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇప్పుడు వారు న్యాయపోరాటం చేస్తారో.. రాజకీయం చేస్తారో కానీ.. అది కేంద్రంపై కూడా చేయాల్సి ఉంది. అంత ధైర్యం చేస్తే.. వారిలో భయం లేదని అనుకోవచ్చు. కానీ వారు భయంతో బతకుతున్నారు. అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారు. అందుకే పీపీపీ విధానంపై కేంద్రంపై ఆరోపణలు చేసేందుకు వారు సిద్ధపడే అవకాశం లేదు. అక్కడే వారి తప్పుడు రాజకీయాలు బయటపడనున్నాయి.
