ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన గవర్నర్ల బదిలీలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గవర్నర్లను మారుస్తూ రాష్ట్రపతి భవన్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల వేళ ఈ ఆకస్మిక మార్పులు అటు జాతీయ స్థాయిలో, ఇటు ఆయా రాష్ట్రాల మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఎన్నికల వ్యూహమా? పరిపాలనా పరమైన నిర్ణయమా?
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ ఆకస్మిక రాజీనామా చేయడంతో ఈ మార్పుల పర్వం మొదలైంది. ఆయన స్థానంలో తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్. రవిని బెంగాల్‌కు బదిలీ చేశారు. తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వంతో నిత్యం ఘర్షణ పడే ఆర్.ఎన్. రవిని, ఎన్నికలు జరగనున్న బెంగాల్‌కు పంపడం వెనుక కేంద్రం గట్టి వ్యూహం ఉందని భావిస్తున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే దూకుడు స్వభావం ఉన్న రవిని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు.
తెలంగాణలో కొత్త సమీకరణలు
తెలంగాణలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లాను కొత్త గవర్నర్‌గా నియమించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎం రేవంత్ వ్యూహంతో ఇతర కాంగ్రెసేతర ప్రభుత్వాలతో ఉన్న ఘర్షణ .. గవర్నర్ తో తెలంగాణలో లేదు. జిష్ణుదేవ్ శర్మ ఎప్పుడూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు శుక్లా రాకతో సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్న తరుణంలో, కేంద్రం తనదైన ముద్ర వేసేందుకే ఈ మార్పు చేసినట్లు భావిస్తున్నారు.
రాజ్యాంగ సంక్షోభాలు రాకుండానా?
ఈ బదిలీలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా గవర్నర్లను మార్చడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆమె ఆరోపించారు. ఈ మార్పుల వెనుక బీజేపీ డబుల్ ప్లాన్ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒకటి—ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉండే లేదా గట్టి పట్టున్న వారిని గవర్నర్లుగా ఉంచడం. రెండు—రాష్ట్ర ప్రభుత్వాలతో ఘర్షణలు ఎక్కువగా ఉన్న చోట ముఖాలను మార్చడం ద్వారా కొత్త వాతావరణాన్ని సృష్టించడం. అని చెబుతున్నారు. ఏది ఏమైనా, ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా కేంద్రం తన ప్రాధాన్యతలను స్పష్టం చేసినట్లయింది.


