హోదా, నిధులు ఇవ్వకపోయినా ఏపి అభివృద్ధి?

ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి అనే ఈ రెండు అంశాలపై రాష్ట్ర ప్రజలకు ఇంకా ఏవయినా ఆశలు, అనుమానాలు, అపోహలు ఉన్నాయేమో కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ మాత్రం లేవని నిన్న కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా మరొక్కసారి స్పష్టమయింది. వాటి కోసం తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని ప్రజలకు తెలియజేయడానికో లేక ప్రతిపక్షాల పోరు భరించలేకనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి సందర్భాలలో ఆ ప్రస్తావన చేస్తుంటారు. దానికి వెంటనే భాజపా నేతలు లేదా కేంద్ర మంత్రులు తమ వద్ద ఉన్న ‘ఇన్ స్టాంట్’ సమాధానం టకీమని చెపుతుంటారు. ఈ డ్రామా గత రెండేళ్లుగా సాగుతున్నదే. మళ్ళీ నిన్న కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ వచ్చినప్పుడు మరోసారి సాగింది.

కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ నిన్న విజయవాడలో గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సదస్సులో పాల్గొన్న తరువాత ఆదరూ కలిసి ఈ డ్రామా వేశారు. యధాప్రకారం ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రిని అభ్యర్ధిస్తే, ఆయన ‘14వ ఆర్ధిక సంఘాన్ని రిఫర్ చేస్తూ అదేమీ రాష్ట్రం కోసం అదనపు నిధులు విడుదల చేయమని ప్రత్యేక సిఫార్సులు చేయలేదని జవాబు చెప్పారు. అంతవరకే అయితే ‘ఇది మనకి మామూలే’ అని సరిపెట్టుకోవచ్చు కానీ కేంద్రం నిధులు ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు వాటిని ఏదోవిధంగా సమకూర్చుకోగల సమర్ధుడు అని చెప్పడం కేంద్ర ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోంది.

ఏపి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా రాష్ట్రం రెండకెల ఆర్ధిక పురోగతి సాధించిందని, అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గొప్పలు చెప్పుకొన్నారు కనుక ఇప్పుడు కేంద్ర మంత్రి వారి మాటలు వారికే అప్పజెప్పారు. కేంద్రం సహాయంతో నిమిత్తం లేకుండా రాష్ట్రం చక్కగా ఆర్ధికాభివృద్ధి సాధిస్తోందని అన్నారు. చంద్రబాబు నాయుడు సమర్ధుడు కనుకనే అది సాధ్యం అయిందని, ఆయన ఎక్కడి నుంచయినా నిధులు సమకూర్చుకోగలరని అన్నారు. అప్పుడే రాజధానికి పునాది కూడా వేసుకొన్నారని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. అందుకు కేంద్రం అన్నివిధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కేంద్ర వైఖరి ఏవిధంగా ఉందో ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం సహాయం చేయకపోవడానికి కారణం ఏమిటో కూడా ఆయన స్పష్టంగానే చెప్పారు. కనుక ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి హామీలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ‘డిలీట్’ చేసుకోవడం మంచిది. రాని వాటి గురించి ఇప్పుడు బాధ పడేబదులు వచ్చే ఎన్నికలలో అందుకు బాధ్యులను ‘డిలీట్’ చేసుకొనే వెసులుబాటు ఉంది కదా అప్పుడు ఆ ఆప్షన్ ఉపయోగించుకోవడం మేలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com