తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలు ఇప్పుడు ఢిల్లీ వేదికగా క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం హస్తినలోనే ఉంటూ ఏఐసీసీ పెద్దలతో వరుస భేటీలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు కారణం అవుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో, ఆ తర్వాత పార్లమెంట్లో రాహుల్ గాంధీతో సమావేశాల తర్వాత కేబినెట్ కూర్పుపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముగ్గురికి ఛాన్స్.. ఇద్దరికి ఉద్వాసన?
ఈ దఫా విస్తరణలో సామాజిక సమీకరణాల ఆధారంగా ముగ్గురు కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, పనితీరు సరిగా లేని లేదా వివాదాల్లో చిక్కుకున్న ఇద్దరు ప్రస్తుత మంత్రులకు ఉద్వాసన పలికే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తవారికి అవకాశం కల్పించడంతో పాటు, పార్టీ విధేయులకు ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించే నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
శాఖల మార్పు – పూర్తిస్థాయి ప్రక్షాళన
కేవలం కొత్తవారిని తీసుకోవడమే కాకుండా, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి శాఖలను కూడా భారీగా మార్పు చేసే అవకాశం ఉంది. పాలనా వేగాన్ని పెంచేందుకు కీలకమైన శాఖలను సమర్థులైన నేతలకు అప్పగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలలో మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలనేది రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది.
అసెంబ్లీ తర్వాతే ముహూర్తం
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ మార్పులు, చేర్పులు ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత, పాలనలో కొత్త ఉత్సాహం నింపేందుకు కేబినెట్ ప్రక్షాళన సరైన సమయమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే, గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చి వాయిదా పడటంతో, ఈసారి నిజంగానే మార్పులు జరుగుతాయా లేక ఇవి కేవలం పుకార్లగానే మిగిలిపోతాయా అన్నది వేచి చూడాలి.


