నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఏటా ఆనవాయితీగా తన స్వగ్రామంలో పండుగ జరుపుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ ఏడాది కూడా కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. భువనేశ్వరి, మంత్రి లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ , ఇతర కుటుంబ సభ్యుల సందడితో గ్రామంలో పండుగ కళ ఉట్టిపడుతోంది. ముఖ్యంగా మనవడు దేవాన్ష్ స్థానిక పిల్లలతో కలిసి పల్లెటూరి క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనగా, ఆ సన్నివేశాలను చంద్రబాబు దంపతులు చిరునవ్వుతో తిలకించారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను భువనేశ్వరి, బ్రాహ్మణి స్వయంగా పర్యవేక్షించి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.
వేడుకల్లో మునిగితేలుతున్నా పండుగ వేళ కూడా ఆయన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలే ప్రాధాన్యం అని చాటుకున్నారు. ఉదయాన్నే ఇంటి వద్ద తనను కలవడానికి వచ్చిన వందలాది మంది బాధితుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. వారి సమస్యలను ఆప్యాయంగా అడిగి తెలుసుకుంటూ, పరిష్కారం కోసం అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల మధ్యలో సాధారణ పౌరుడిలా మమేకమవడమే కాకుండా, వారి కష్టాలను ఆలకించి భరోసా కల్పిస్తున్నారు.
స్వర్ణ నారావారిపల్లి లో భాగంగా సుమారు రూ.126 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి సాగునీటి ప్రాజెక్టులు, అత్యాధునిక సబ్ స్టేషన్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటి కీలక ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా, పండుగ కానుకగా పేద మహిళలకు ఇ-ఆటోలను పంపిణీ చేశారు. అటు కుటుంబ సభ్యులతో పండుగ ఆనందాన్ని పంచుకుంటూనే, ఇటు రాష్ట్రాభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమైన సీఎం శైలి అందరినీ ఆకట్టుకుంటోంది.
