హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఖాళీ అయిపోయింది! అధికారికంగా ఇకపై పాలన అంతా అమరావతి నుంచే జరుగుతుందని ఏపీ సర్కారు ప్రకటించింది. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉన్న ఫైళ్లూ కంప్యూటర్లూ అన్నీ ఖాళీ చేశారు. ఖాళీ చేసిన సెక్రటేరియట్ భవనాన్ని తెలంగాణ సర్కారుకు ఇచ్చేస్తారా లేదన్నదానిపై స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది. చారిత్రక సెక్రటేరియట్ భవనం నుంచి చారిత్రక నగరం అమరావతికి ఆంధ్రా పాలన వెళ్లిపోయింది. ఎప్పుడో ఆరో నిజాం పాలనా కాలంలో నుంచీ ఈ భవనం సెక్రటేరియట్‌గా కొనసాగుతోంది. నాడు నిజాం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ భవనాన్ని సచివాలయంగా మార్చారట! ఎదురుగా ట్యాంక్ బండ్, చుట్టూ చెట్లు ఉండటంతో ఈ భవనంలో నిజాం ఉంటే ఆరోగ్యానికీ మంచిదని నిర్ణయించారట. ఇప్పుడా చారిత్రక భవనం నుంచి ఆంధ్రా అమరావతికి వెళ్లిపోయింది.
రాష్ట్ర విభజనకు ముందు వరకూ సెక్రటేరియట్ కళ వేరుగా ఉండేది. తెలంగాణ ఏర్పాటు తరువాత నుంచి పరిస్థితులు నెమ్మదిగా మారిపోయాయి. పాలనను ఆంధ్రాకి తీసుకెళ్లిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట్నుంచీ పట్టుదలతోనే ఉన్నారు. నిజానికి, పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని నగరంగా హైదరాబాద్‌లో ఉండొచ్చు. కానీ, పాలనా సౌలభ్యం కోసం తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేసుకుని ఏపీకి సచివాలయాన్ని తరలించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సెక్రటేరియట్ తరుచూ రావడం లేదన్న సంగతి తెలిసిందే! ఏవో వాస్తు సంబంధమైన దోషాలు కారణంగా చెబుతూ ఆయన సెక్రటేరియట్‌కు రావడం మానేశారని చెబుతున్నారు. క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు మాత్రమే ఆయన సెక్రటేరియట్లో కనిపిస్తారు. ఇకపై అది కూడా ఉండదని అంటున్నారు. ఎందుకంటే, బేగంపేటలోని ముఖ్యమంత్రి కొత్త క్యాంపు ఆఫీస్ సిద్ధమైపోయిందని సమాచారం. దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. దసరా పండుగ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడే ఉంటారని చెబుతున్నారు. అక్కడి నుంచే ఆయన పనిచేస్తారంటున్నారు. అంటే, ఆయన సెక్రటేరియట్‌కు వచ్చే అవకాశాలు ఉండదన్నట్టే కదా! అంతేకాదు, సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని కూడా క్యాంపు ఆఫీసుకు తరలించే ప్రతిపాదన ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
చంద్రబాబు సర్కారు సచివాలయం నుంచి ఆంధ్రాకి వెళ్లిపోయింది. ఇప్పుడున్న తెలంగాణ సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే పరిస్థితి లేదు! ఏన్నో ఏళ్లపాటు సచివాలయంగా వెలుగొందిన ఆ భవనం పరిస్థితి ఇప్పుడిలా మారిపోయిందన్నమాట!