నిజానికి, రాజకీయ పార్టీల సర్వేలు రెండు రకాలు! నిజం తెలుసుకోవడానికి చేసేవి ఒకటో రకం. మనకు తెలిసిన నిజాన్నే ప్రజలు చెప్పేలా చేసేవి రెండో రకం. మొదటి రకం సర్వే ఫలితాలు బయటకి రావు! ఎందుకంటే, అవి వాస్తవాలను ప్రతిబింబిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకునే అలవాటు ఉంది. సొంత పార్టీ నాయకుల తీరుపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూనే ఉంటారని అంటారు! పార్టీ నాయకుల్లో పక్కబెదురు ఉండేందుకు అదో వ్యూహం కావొచ్చు. సరే, తాజాగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సలహాతోనే ప్రధాని నిర్ణయం తీసుకున్నారంటూ టముకు వేయించే ప్రయత్నం చేశారు. అయితే, కేంద్ర నిర్ణయంపై సామాన్యుడు భగ్గుమంటూ ఉండటంతో, ఆ సెగల వేడి తమకూ తగిలే ప్రమాదం ఉందని ఆ మాట మానేశారు.
పెద్ద నోట్ల రద్దుపై ప్రజలు ఏమనుకుంటున్నారూ.. అనే విషయమై ఐవీఆర్ పద్ధతిలో చంద్రబాబు సర్వే చేయించుకున్నారట. నల్లధనం నిర్మూలించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నా, పెద్ద నోట్లను రద్దు చేసి ప్రత్యామ్నాయ చర్యలను గాలికి వదిలేశారన్న ఆగ్రహం ఆ సర్వేలో ప్రతిబింబించినట్టు సమాచారం. కేంద్రం చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యలపై 72 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట! దీంతో బిత్తరపోయి.. ‘ఆ నిర్ణయం నా సలహా’ అని చెప్పుకోవడం మానేసి, కేంద్రం తీరుపై విమర్శలూ మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే… నోట్ల రద్దు నిర్ణయంపై ప్రధాని మోడీ కూడా సొంత మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేశారు. తద్వారా 5 లక్షలమంది స్పందించారు. 93 శాతం మంది మోడీ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారని భాజపా చెప్పుకుంటోంది. మొత్తం దేశం జనాభాను ఈ 5 లక్షల మందే రిప్రజెంట్ చేయగలుగుతారా అనేది ప్రశ్న? మొత్తం జనాభాలో స్మార్ట్ ఫోన్లు వాడేది ఏ 18 శాతమో ఉంటారు. అంటే, మిగతా జనాభిప్రాయాన్ని ఎక్కడ రిఫ్లెక్ట్ అయిందనేది ఇంకో ప్రశ్న..? గ్రామీణులూ రైతులూ నిరక్షరాశ్యులకు ఈ యాప్ గురించే తెలీదు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అంతంత మాత్రమే. మరి, భాజపా చెబుతున్న లెక్కల్లో భారతీయుల స్పందన ఉన్నట్టా లేనట్టా..?
సరే, కాసేపు మోడీ సర్వే నిజమనుకుందాం. అలాంటప్పుడు చంద్రబాబు సర్వే ఫలితాలు ఎందుకు భిన్నంగా ఉంటాయి..? ఇక్కడా అవే రిఫ్లెక్ట్ కావాలి కదా. అవినీతి రద్దుకు పెద్ద నోట్లను రద్దు చేయడమే పరిష్కారమని ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు… ఇప్పుడు తన సర్వే ఫలితాలను కూడా మోడీకి పంపితే మంచిది! పెద్ద నోట్ల రద్దుపై రెండు రకాల సర్వేలూ ఇప్పుడు ఉన్నాయి. జనం చెప్పాలనుకుంటున్నది చంద్రబాబు సర్వే చెబుతోంది. జనానికి చెప్పాలనుకుంటున్నంది మోడీ సర్వే చెబుతోంది. ‘సర్వే’జనా సుఖినోభవంతు..!