ప్రొ.నాగేశ్వర్: ప్రాంతీయ పార్టీల ప్రధానమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు..!

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం.. దేశం దృష్టిని ఆకర్షించింది. వచ్చే ఏడాదిలో జరగనున్న రాజకీయ పరిణామాలకు.. ఈ వేడుక ఓ వేదిక అయింది. కాంగ్రెస్ పార్టీతో వేదిక పంచుకోవాల్సి వస్తుందని తెలిసినా.. విమర్శలు వస్తాయని తెలిసినా.. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ వేడుకకు హాజరవడం.. చాలా మందిని ఆశ్చర్య పరిచింది. కానీ చంద్రబాబు రాజకీయంగా చాలా ముందు చూపుతో ఉన్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలో… 38 అసెంబ్లీ సీట్లు వస్తేనే… కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంటే.. దక్షిణాదిలో ముఖ్యంగా కర్ణాటకలో బీజేపీకి అధికారం దక్కనీయకూడదన్న ఉద్దేశంతోనే.. కాంగ్రెస్ పార్టీ.. తను సాధించిన సీట్లలో సగం కూడా గెలుపొందని జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసింది.

ఢిల్లీ రాజకీయాల్లోనూ కర్ణాటక పరిస్థితి..!

కర్ణాటక రాజకీయాల పరిస్థితే జాతీయ రాజకీయాల్లోనూ వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి, ప్రధానమంత్రి నేరంద్రమోదీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఇందులో నిన్నామొన్నటి వరకు బద్దశత్రువులుగా ఉన్న అఖిలేష్ – మాయవతి, మమతా బెనర్జీ -సీతారాం ఏచూరీ లాంటి వారు ఒకే వేదిక పంచుకున్నారు. వీరందర్నీ బీజేపీ వ్యతిరేకతే ఏకం చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా.. కర్ణాటక తరహా ఫలితాలే ఉంటాయన్న అంచనాలున్నాయి. అంటే అటు బీజేపీకి కానీ.., ఇటు కాంగ్రెస్ కు కాని పూర్తి మెజార్టీ రాకపోవచ్చు.. అప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. కాంగ్రెస్ కు అధికారం ఇవ్వకూడదని బీజేపీ.. బీజేపీకి అధికారం ఇవ్వకూడదని.. కాంగ్రెస్ రెండూ పోటీ పడి.. ప్రాంతీయ పార్టీల నేతలకు ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేయవచ్చు.

ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించే చాన్స్..!

ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకమైతే.. వాటి తరపున ప్రధానమంత్రి అయ్యే వారికి మద్దతు ఇవ్వడానికి బీజేపీ .. కన్నా కాంగ్రెస్‌నే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే.. బీజేపీ మద్దతు కన్నా..కాంగ్రెస్ మద్దతు తీసుకోవడానికే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు సిద్ధపడతాయి. ప్రాంతీయ పార్టీల నేతల్లో ప్రధాని పదవి చేపట్టగల నేతల చాలా మంది ఉన్నారు. కేసీఆర్ , మాయవతి, ములాయం, మమతాబెనర్జీ, చంద్రబాబు ఈ జాబితాలో ఉంటారు.

ప్రాంతీయ పార్టీల నాయకుడెవరు..?

ప్రాంతీయ పార్టీల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు నాయకత్వం వహించాలన్న ప్రశ్న మొదటగా వస్తుంది. ఈ అంశంలో మొదటగా కేసీఆర్ పరిశీలనకు తీసుకుంటే..ఆయనకు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. కాబట్టి.. కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించే ప్రశ్నేలేదు. ఇక బలమైన దళిత నాయకురాలు మాయావతి. మాయవతికి ప్రధానమంత్రిగా అవకాశం వస్తే.. ఆమె పార్టీని దేశమంతా విస్తరింపచేసుకుంటారు. ఇది కాంగ్రెస్ కు నష్టం. తాను మద్దతిచ్చి తన పార్టీకి నష్టం చేసుకోవాలని ఏ పార్టీ అనుకోదు. ఇక మమతా బెనర్జీ. బెంగాల్ సీఎం ప్రధానమంత్రిగా అయ్యే విషయంలో ప్రధాన అడ్డంకి లెఫ్ట్ పార్టీల నుంచి వస్తుంది. మాయావతి ఇటీవల..లెఫ్ట్ పార్టీలతో కాస్త సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు ప్రధానిగా ఆమె నాయకత్వాన్ని అంగీకరించరు. లెఫ్ట్ పార్టీల ఆమోదం లేకుండా కాంగ్రెస్ మద్దతుతో ప్రధాని కావడం కష్టం.

చంద్రబాబుకు అన్నీ ప్లస్ పాయింట్లే.. !

ఇక మిగిలింది చంద్రబాబు. చంద్రబాబు విషయంలో ఏ పార్టీకి పెద్దగా అభ్యంతరాలు ఉండవు. పైగా ఆయనకు జాతీయ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. శివసేన లాంటి ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా సపోర్ట్ చేస్తాయి. బీజేడీతో పాటు తమిళనాడు నుంచి కొన్ని పార్టీల మద్దతు ఉంటుంది.ఇంకా చెప్పాలంటే.. ముఖ్యమంత్రిగా ఆయన ఆర్థిక సంస్కరణలు చురుగ్గా అమలు చేసి… ప్రపంచబ్యాంక్ లాంటి సంస్థలతో పాటు… కార్పొరేట్ లాబీతోనూ సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా… భారత రాజకీయాల్లో కార్పొరేట్ లాబీ నిర్ణయాత్మక శక్తి కాదనలేనిది. ఈ విషయంలోనూ చంద్రబాబుకు సానుకూలత ఉంది.
ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాతనే చంద్రబాబునాయుడు ప్రాంతీయ పార్టీల కూటమి సభగా మారిన … కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని… తెలుగు రాష్ట్రాలకే సేవలు చేస్తారని చంద్రబాబు చెబుతున్నారు. కానీ లోకేష్ ను మంత్రి చేయడం దగ్గర్నుంచి.. ఆయన అడుగులన్నీ వ్యూహాత్మకంగానే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com