ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు కేంద్రప్రభుత్వం రూ.1976 కోట్లు విడుదల చేసింది. దానిపై ప్రతిపక్షాల కంటే ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు స్పందించారు.
ముఖ్యమంత్రి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే, ఉమా మహేశ్వర రావు మాత్రం ‘కేంద్రప్రభుత్వం ముష్టి విదిలించింది’ అని చాలా ఘాటుగా విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వదలచుకొందా లేకపోతే ఆర్ధిక ప్యాకేజి ఇవ్వదలచుకొందా? అనే విషయం స్పష్టం చేయాలి. బుందేల్ ఖండ్ కి ఇచ్చిన ప్యాకేజి వంటిది ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఈరోజు విడుదల చేసిన నిధులపై కూడా కేంద్రప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే రూ. 12000 కోట్లు ఆర్ధిక లోటుతో రాష్ట్రం చాలా సతమతమవుతోంది. రాష్ట్ర పరిస్థితి గురించి పదేపదే మోర పెట్టుకొంటున్నా కేంద్రప్రభుత్వం చాలా నామమాత్రంగానే నిధులు విడుదల చేస్తోంది. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన పనులేవీ పెద్దగా జరుగానే లేదు. విభజన కారణంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆడుకోవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. కనుక ఉదారంగా నిధులు మంజూరు చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలి. విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, ఆర్దికలోటు భర్తీ, రైల్వేజోన్ ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం అనే 5 ప్రధాన హామీలని కేంద్రప్రభుత్వం నిలబెట్టుకోవాలి,” అని అన్నారు.
బొండా ఉమామహేశ్వర రావు చాలా నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పారు. “కేంద్రప్రభుత్వం తీరు కొండని త్రవ్వి ఎలుకని పట్టినట్లుంది. నెలరోజులుగా ఊరించి ఊరించి చివరికి ముష్టి 1976 కోట్లు విదిలించింది. రాజధాని కోసం ఇచ్చిన రూ.400 కోట్లు డ్రైనేజ్ పనులకే సరిపోవు. రాజధాని నిర్మాణానికి రూ.47,500 కోట్లు అవసరం ఉంటుందని మేము డీ.పి.ఆర్ ఇచ్చేము. కానీ కేంద్రప్రభుత్వం రెండువేల కోట్లు విదిలించింది. ఇక పోలవరానికి సుమారు రూ.30,000 కోట్లు అవసరం ఉంటే రూ.700 కోట్లే ఇచ్చింది. ఈ లెక్కన పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కేంద్రప్రభుత్వానికి ఇంత చిన్న చూపు ఎందుకో నాకూ అర్ధం కావడం లేదు,” అని అన్నారు.
ఇంకా తెదేపాలో చాలా మంది నేతలు నేడోరేపో కేంద్రంపై బాణాలు ఎక్కుపెట్టవచ్చు. అప్పుడు రాష్ట్ర భాజపా నేతలు కూడా ఎదురుదాడికి దిగవచ్చు. మధ్యలో కాంగ్రెస్, వైకాపాలు తక్షణమే ఇద్దరు తెదేపా కేంద్రమంత్రుల చేత రాజీనామాలు చేయించి నిరసన తెలపాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టవచ్చు. అప్పుడు ఏ పరిణామాలకి దారి తీస్తుందో చూడాలి.