అమరావతి రైతుల్లో కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొంత మంది రైతులు జేఏసీ పేరుతో గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించి డిమాండ్లు వినపించారు. సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం రాలేదన్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది. కార్యాలయం ప్రారంభించిన సమయంలో అమరావతి రైతుల అసంతృప్తి గురించి మాట్లాడారు.
త్వరలో అమరావతి రైతులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అమరావతి రైతులను మరిచేదే లేదు. ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, శ్రవణ్ కుమార్లకు అప్పగిస్తున్నట్లుగా ప్రకటించారు. వీరు ముగ్గురూ రైతులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
అందరం కలిసి రాజధానిని అభివృద్ధి చేసుకుందాం.. సీఆర్డీఏ భవనం ప్రారంభం మన అభివృద్ధి యాత్రకు ఆరంభం అన్నారు. రాజధాని అమరావతి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది… దేశంలోని పవిత్ర దేవాలయాలు, మసీదులు, చర్చీల నుంచి మట్టి, జలాలు తెచ్చి శంకుస్థాపన చేశామని.. అమరావతి రైతుల అభివృద్ధికి అండగా ఉంటాం… హ్యండ్ హోల్డింగ్ ఇస్తామని భరోసా ఇచ్చారు. రైతులుగా మారి..తమకు ప్రాధాన్యత లేదని ప్రత్యేకంగా జేఏసీలుగా ఏర్పడటం వల్ల సమస్యలు వస్తున్నాయని కొంత మంది అంటున్నారు. మంత్రి పెమ్మసాని ఈ సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నారు.